Anganwadi Strike 31st Day in AP:తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 31రోజు కొనసాగుతోంది. సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ అంగన్వాడీలు వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నారు. కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ విజయనగరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు దీక్ష చేశారు. బాపట్లలో అంగన్వాడీలు ఉరి తాళ్లు వేసుకుని ప్రభుత్వంపై పాటలు పాడుతూ ఆందోళన చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఒంటి కాలిపై నిలబడి నమస్కరిస్తూ నిరసన చేశారు. మోసపూరిత హామీలతో మభ్య పెట్టారంటూ అనంతపురంలో కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు కుర్చీలు తలపై పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నోటిసులు ఇచ్చి భయపెట్టడం సిగ్గు సిగ్గు అంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీడీపీవో కార్యాలయం ఎదుట బైఠాయించి అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Anganwadi Problems Government Not Solve: అనంతపురం జిల్లా సింగనమల తహశిల్దార్ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింగనమల సీఐటీయు యూనియన్ అధ్యక్షురాలు మాట్లాడుతూ 31 రోజులుగా సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుందన్నారు. ఈ ప్రభుత్వంలో మాకు జీతాలు పెంచకపోయినా వచ్చే ప్రభుత్వంతోనైనా జీతాలు పెంచుకొని విధుల్లో చేరుతామని తెలిపారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి ఎన్నికల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలను మార్చుకుంటున్నారని మండిపడ్డారు.
బెదిరింపులకు పాల్పడినా సమ్మె విరమించం - స్పష్టం చేసిన అంగన్వాడీలు
Anganwadi Strike in All Districts: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు, కార్యకర్తలు మినీవర్కర్లు నిరవధిక సమ్మె నెల రోజులకు చేరింది. మూడు దఫాలుగా మంత్రులు చర్చలు జరిపినా స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడంతో సమ్మె కొనసాగుతూ వస్తోంది. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రకటించినా ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపేందుకు సీఐటీయు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ యూనియన్ ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈసారైనా స్పష్టమైన హామీ రాకపోతే తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. సంక్రాంతి పండుగను కూడా దీక్ష శిబిరాల్లోనే నిర్వహించాలని నిశ్చయించారు. భోగి సందర్భంగా అంగన్‌వాడీ, మినీ టీచర్లకు, సహయకులకు ఇచ్చే నోటీసులను భోగీ మంటల్లో వేస్తామన్నారు.