ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరాయి పంచనే అంగన్‌వాడీల నిర్వహణ - విజయనగరం జిల్లా అంగన్వాడీ కేంద్రాలు

విజయనగరం జిల్లాలో అంగన్​వాడీలకు సొంత భవనాల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. నిధులున్నా నిర్మాణాలు సాగడంలేదు. కొన్నిభవనాలు అసంపూర్తిగా ఉండగా.. మరికొన్ని అసలు ప్రారంభమే కాలేదు. చాలావరకు కేంద్రాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి.

anganwadi centres at rent buildings
అద్దె గదుల్లో అంగన్వాడీలు

By

Published : Oct 4, 2020, 3:46 PM IST

పూర్వ ప్రాథమిక విద్యను అందించే అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. కొన్నిచోట్ల నిధులు మంజూరవుతున్నా పనులు సాగడం లేదు. అటు ఇంజినీరింగ్‌ అధికారులతో పాటు, గుత్తేదారులూ శ్రద్ధ చూపని కారణంగా... అసంపూర్తిగానూ, కొన్ని అసలు ప్రారంభానికే నోచుకోవడం లేదు. ఫలితంగా... విజయనగరం జిల్లా వ్యాప్తంగా పలు కేంద్రాలు అద్దెగదుల్లో మగ్గుతున్నాయి.

నిర్మాణాల్లో జాప్యం

జిల్లా వ్యాప్తంగా 940 కేంద్రాలకు రెండేళ్ల కిందట ఉపాధిహామీ పథకం నుంచి రూ.5 లక్షలు, నాబార్డు నిధుల నుంచి రూ.2 లక్షలు, పంచాయతీ నుంచి రూ.50 వేలను మంజూరు చేశారు. పనులు చేపట్టేందుకు అప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. కొన్నిచోట్ల ప్రారంభించిన 456 భవనాలు పలుదశల్లో అసంపూర్తిగా ఉండిపోయాయి. పనులు చేస్తే పంచాయతీ నుంచి రూ.50 వేలు వాటాపెట్టాల్సి ఉన్నందున కొత్తగా వచ్చిన పాలకవర్గం నిధులు అందించరని వెనుకడుగు వేస్తున్నారు. ఈ ఏడాది మరో 357 కేంద్రాలకు నిధులు మంజూరు చేసినా, వీటి పరిస్థితి అలాగే ఉంది. ఆర్‌ఐడీఎఫ్‌ పథకం కింద 56 భవనాలకు రూ.11 లక్షల చొప్పున నిధులు మంజూరైనా ఇప్పటికీ స్థల సేకరణ జరగలేదు.

సౌకర్యాలూ అంతంతమాత్రమే..

అంగన్‌వాడీల్లో సౌకర్యాలు, కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పనితీరును లెక్కగట్టేందుకు ప్రభుత్వం ఇటీవల యాప్‌ను రూపొందించింది. ఎప్పటికప్పుడు దీంట్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న భవనాల్లో చాలాచోట్ల తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో ఆయా వివరాలను అప్‌లోడ్‌ చేసేటప్పుడు సూచికలు పడిపోయే ప్రమాదం ఉంది. దీనిపై ఇప్పటికే సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలను ఆనుకుని ఉన్న 272 అంగన్‌వాడీ కేంద్రాల్లో మొదటి విడత సౌకర్యాల కల్పనకు నాడు- నేడు కింద ఇటీవల ప్రతిపాదనలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. అయితే పాఠశాల ఆవరణలో నిర్మించిన భవనాలు కొత్తవి కావటంతో వాటికి ఏ విధంగా హంగులు కల్పించాలనే అంశంపై సతమతమవుతున్నారు.

దృష్టి సారిస్తాం..

నిధులు మంజూరైన వాటికి వెంటనే భవన నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టరు ఆయా శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. స్థలాల సమస్య కొలిక్కి వస్తే మిగిలిన ప్రాంతాల్లోనూ ప్రారంభమవుతాయి. కేంద్రాల్లో వసతుల కల్పనపై దృష్టిసారిస్తున్నాం. - రాజేశ్వరి, పీడీ, ఐసీడీఎస్

అంగన్‌వాడీ కేంద్రాలు: 3,729

అద్దె, ఉచితంగా ఇచ్చిన భవనాల్లో కేంద్రాలు: 2,854

సొంత భవనాల్లో నడుస్తున్నవి : 945

నిధులు మంజూరైన భవనాలు(మూడుదశల్లో ): 1,297

నిర్మాణదశలో ఉన్నవి: 456

ఆర్‌ఐడీఎఫ్‌లో మంజూరైన భవనాలు: 56 (నిర్మాణాలు ప్రారంభం కాలేదు)

ప్రభుత్వ స్థలాలు కలిగిన కేంద్రాలు: 1,250

స్థలాల సమస్య ఉన్నవి: 853

ఇవీ చదవండి:

రెండేళ్ల క్రితం తప్పిపోయిన కుమారుడు..తల్లి చెంతకు క్షేమంగా..

ABOUT THE AUTHOR

...view details