Flexi dispute between Janasena and YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ(వైఎస్సార్ కాంగ్రెస్) జనసేన పార్టీ మధ్య ఫ్లెక్సీ వివాదం ముదురుతోంది. తమ పార్టీ అధినేతను కించపరుస్తూ.. ఇష్టారీతిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారా..? అంటూ జనసైనికులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే జనసేన పార్టీకి వ్యతిరేకంగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారో.. అదేచోట వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా జనసైనికులు ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో జనసైనికులపై కోపోద్రిక్తులైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. కొన్ని చోట్ల ఫ్లెక్సీలను చించేశారు. మరికొన్ని చోట్ల జనసేన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు.
ఒంగోలులో మొదలైన ఫ్లెక్సీ వివాదం.. ఒంగోలు జిల్లాలో ఆదివారం రోజున జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీ వివాదం మొదలైంది. మొదటగా 'పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్దం' పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒంగోలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనసేన అధినేతకు వ్యతిరేకంగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో.. ఒకవైపు సీఎం జగన్ పేదల పక్షం వహిస్తున్నట్లు.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ కూర్చున్న పల్లకిని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, కొందరు మోస్తున్నట్లు చిత్రాలను చిత్రీకరించారు. వాటిపై ఆగ్రహించిన జనసేన కార్యకర్తలు.. 'రాక్షస పాలనకు అంతం-ప్రజా పాలనకు ఆరంభం' పేరుతో ఈరోజు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో.. సీఎం జగన్ ఒక చేతిలో గొడ్డలి.. మరో చేతిలో వైఎస్ వివేకానంద రెడ్డి తల పట్టుకొని ఉండగా.. దుష్ట శక్తులపై పవన్ కల్యాణ్ విల్లు ఎక్కుపెట్టినట్లు చిత్రాలు చిత్రీకరించారు.
Pawan on New Parliament Building: భరతమాత మెడలో మరో మణిహారం సెంట్రల్ విస్టా : పవన్ కల్యాణ్
విజయనగరంలో జనసైనికుల ఆందోళన..జనసేన పార్టీకి వ్యతిరేకంగా వెలసిన ప్లెక్సీలకు నిరసనగా విజయనగరం జిల్లాలో జనసైనికులు ఆందోళనకు దిగారు. అనంతరం వాటి పక్కనే జనసైనికులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ప్లెక్సీల్లో "ఔనౌను.. జగన్ చాలా పేదవాడు" అనే పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం అయినా, సీఎం అయినా వారు చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం చేసుకుంటారు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రజలు, ప్రాంతాలు, యువకుల, వర్గాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తోంది. ఈ విధానాలు సరైనవి కావు. ఆ పార్టీ నేతలకు తెలియచేసేందుకే వైఎస్సార్సీపీ ప్లెక్సీలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ప్లెక్సీలను ప్రదర్శించాము'' అని వారు అన్నారు.