AP MINISTER BOSTA REVIEW ON JAGANANNAKU CHEBUDAM: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీన ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని రేపు (మంగళవారం) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచే వచ్చే ప్రతి వినతిని పరిష్కారించటమే లక్ష్యంగా అధికారులు ముందుకుసాగనున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమంపై అధికారులతో నేడు విజయనగరం జిల్లాలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రతీ అధికారి చిత్తశుద్దితో పనిచేయాలి..ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజా వినతుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇందులో భాగంగా జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని.. మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించే వినతుల పరిష్కారంపై ప్రతి అధికారి చిత్తశుద్దితో వ్యవహరించాలని ఆదేశించారు.
అధికారులు వెంటనే స్పందించాలి.. అనంతరం ఎలాంటి ప్రజా సమస్య ఉన్నా అధికారులు వెంటనే స్పందించి వాటికి తగిన పరిష్కారం ఆలోచించాలని.. మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు సూచించారు. 'జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై, తుఫానుపై, ముందస్తు అప్రమత్తపై.. అకాల వర్షాల కారణంగా పంట నష్టంపై ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి చిరంజీవి చౌదరి, జిల్లా ప్రత్యేక అధికారి సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితరులతో కలిసి మంత్రి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.