విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడాం వద్ద ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఇద్దరు మెంటాడ మండలం పెద్ద మేడపల్లికి చెందిన రెడ్డి పెంటయ్య (55), బొడ్డు బుచ్చయ్య (45) గా గుర్తించారు. పార్వతీపురంలోని వారపు సంతకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా... మరడాం వద్ద రహదారిపై ప్రమాదానికి గురయ్యారు.
విజయనగరం నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై పయణిస్తున్న ఇద్దరు సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.