Indian Navy Employee Died: అతనో నావికాదళ ఉద్యోగి.. ఇంటికి పెద్ద కుమారుడు. ఏడాది క్రితం తండ్రిని కోల్పోవడంతో.. అప్పటి నుంచీ తల్లి, సోదరి, సోదరుడిని అన్నీ తానే చూసుకుంటున్నాడు.. గోవింద్. కానీ ఇంతలోనే వారి కుటుంబంలోకి తీవ్ర విషాదం ఉప్పెనలా దూసుకువచ్చింది. శిక్షణ కోసం కోల్కతా వెళ్లిన పెద్ద కుమారుడు గోవింద్.. ప్రమాదంలో మృతి చెందారనే వార్తతో వారి కుటుంబంలో ఒక్కసారిగా చీకటి కమ్మేసినట్లు అయింది.
జీవితంలో ఏదో సాధించాలని.. దేశానికి సేవ చేయాలని ఎంతో ఉత్సాహంగా వెళ్లిని కుమారుడు.. మళ్లీ ఇంటికి వచ్చేది విగత జీవిగానే అని తెలిసిన ఆ తల్లి కన్నీటిని ఎవరు ఆపగలరు. ఏమని చెప్పి ఆపగలరు. ఏడాది క్రితమే భర్తను కోల్పోయి.. ఆ బాధ నుంచి కోలుకోక మునుపే మరో విషాద వార్త విని ఏ తల్లి మాత్రం తట్టుకోగలదు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామానికి చెందిన ఇండియన్ నేవీ ఉద్యోగి చందక్ గోవింద్ భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో తనకు ఇష్టమైన నావికాదళంలో ఉద్యోగాన్ని పొందాడు. కానీ అతను శిక్షణ సమయంలో మృతి చెందడంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పారాచూట్ శిక్షణలో చోటు చేసుకున్న ప్రమాదంలో గోవింద్ (30) మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు.