విజయనగరం జిల్లా పాచిపెంట మండల పరిధిలోని చిల్లమామిడిగూడెంలో... అంతుచిక్కని వ్యాధి అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. శరీరం మొత్తం బొబ్బలు రావడం సహా... కాళ్లు, చేతులు వంకర్లు పోయి ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. పది రోజుల వ్యవధిలోనే 8మంది చనిపోవడం భయాందోళనలు రేకెత్తిస్తోంది. మూడేళ్ల కిందట ఒకేసారి ఐదుగురు ఈ విధంగా మృతి చెందారు. నాటి నుంచీ మొత్తం 32 మందిని ఈ రోగం బలి తీసుకుంది. మరికొంత మంది వ్యాధి లక్షణాలతో కృశించిపోతున్నారు.
చిల్లమామిడిగూడెంలో 36 ఇళ్లు ఉండగా.... 2వందల మందికి పైగా గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. వింత రోగంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన కరవైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాకే... ఒక్కరోజు వైద్య శిబిరం నిర్వహించారన్నారు.