విజయనగరం జిల్లా సాలూరు మండలం మారుమూల ప్రాంతమైన కొదమ గ్రామ గిరిజనులు స్వచ్ఛందంగా రహదారి నిర్మాణం చేపట్టడంపై నటుడు సోనూసూద్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. వారిపై ప్రశంసలు కురిపించారు.
కొదమ పంచాయతీలోని రెండు గ్రామాల గిరిజనులు చందాలు వేసుకొని రహదారి నిర్మించుకున్నారు. కొదమ పంచాయతీలో 150 కుటుంబాలు ఉన్నాయి. వీరు తమ గ్రామాల నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా సరిహద్దు వద్ద ఉన్న బారి గ్రామం సంతకు వెళ్తుంటారు. ఆ ఊరి వరకైనా రహదారి నిర్మించుకోవాలని వారు సంకల్పించారు. ఒక్కో ఇంటికి రెండు వేల రూపాయలు చొప్పున చందాలు సేకరించారు. రెండు పొక్లెయిన్లతో రెండు వారాల పాటు కొండను తొలిచారు. మరో వారం రోజుల పాటు మట్టి వేసి 4 కిలోమీటర్ల దారిని ఇటీవలే ఏర్పరుచుకున్నారు.