విజయనగరం జిల్లా పార్వతీపురం బెలగాం చివరలో ప్రధాన రహదారి పక్కన నివాసాల మధ్య ఉన్న ఓ ఇల్లు కొన్నేళ్లుగా ఖాళీగా ఉంటోంది. ఆ ఇంటి ముందు భాగంలో సిమెంట్ దుకాణం నడుపుతున్నారు. ఇవాళ దుకాణానికి రంగులు వేసేందుకు అవసరమైన నీటి కోసం ఓ వ్యక్తి ఆ పాత ఇంటిలోకి వెళ్లాడు. చీకట్లో అక్కడ అస్థిపంజరాన్ని గమనించి.. వెంటనే బయటకు పరుగులు తీశాడు. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు స్థానికులు.
ఎస్సై జయంతి.. సిబ్బందితో కలిసి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. అస్థిపంజరం ఉన్న తీరు చూసి.. ఘటన నాలుగు నెలలకు ముందే జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటన ప్రాంతం వద్ద గుమిగూడారు. క్లూస్ టీమ్ అక్కడ కొన్ని ఆధారాలు సేకరించింది. గతంలో వ్యక్తి అదృశ్యం వంటి ఫిర్యాదులేవీ రాలేదని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జయంతి తెలిపారు.