విజయనగరంలోని బాడంగి మండలంలో ఏర్పాటైన గ్రంథాలయం దినదినాభివృద్ధి చెందుతూ పాఠకులను ఆకర్షిస్తోంది. ఒకసారి అక్కడ అడుగుపెట్టితే పాఠకుడు పదేపదే రావాలన్న వాతావరణం గ్రంథాలయ సొంతం. ఒకప్పుడు ఆదరణ కరువై పక్కా భవనం లేక అద్దె ఇళ్లల్లో... అసౌకర్యాల నడుమ పాఠకులు కూర్చునేందుకు చోటులేని దీనస్థితి. 33 ఏళ్ల కిందట మండలంలో గ్రంథాలయం ఏర్పాటైంది. 32ఏళ్ల పాటు అద్దె భవనాల్లోనే నడిచింది. ఏడాది కిందట రూ.12.60 లక్షల వ్యయంతో ప్రభుత్వం నిర్మించిన పక్కా భవనంలోకి మారింది.
నాటి నుంచి మంచి ఆకర్షణీయంగా మారింది. రామభద్రపురం - రాజాం రోడ్డు పక్కన గ్రంథాలయం ఏర్పాటు చేయటంతో ఆ మార్గం ద్వారా రాకపోకలు చేస్తున్న వారందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రోజురోజుకు పాఠకుల సంఖ్య పెరుగుతోంది. దీనంతటికీ దివ్యాంగుడైన గ్రంథాలయాధికారి అట్టాడ అప్పారావు కృషి దాగి ఉంది. 2011లో ఉద్యోగంలో చేరిన ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రభుత్వ గ్రంథాలయానికి స్థల సమీకరణ, నూతన భవన నిర్మాణానికి చేసిన ప్రయాత్నాలు ఫలించాయి.
ఇంతలా ఆ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దడానికి అప్పారావు పడిన బాధలు మాటల్లో వర్ణించలేనివి. ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి... లైబ్రరీ అభివృద్ధి కోసమే పరితపిస్తూండేవారు. ఎంతలా అంటే 2013లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోగా దాన్ని పూర్తిగా తొలగించారు. అయినా పట్టుదలతో గ్రంథాలయమే తన సర్వస్వంగా భావించి అభివృద్ధి చేశారు.
ఈ గ్రంథాలయంలో 5300 పుస్తకాలు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో బల్లలు, కుర్చీలు సమకూర్చారు. న్యూస్ పేవర్లు, మేగజైన్లు, వార, పక్ష, మాసపత్రికలు వస్తున్నాయి. వీటితోపాటు రాజారామమోహన్ రాయ్ ఫౌండేషన్ వారు సమకూర్చిన 1000కి పైగా కొత్త పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి.
గ్రంథాలయంలో సుమారు 2వేలు పోటీ పరీక్షలకు అవసరమైన విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు, వెయ్యి బాలసాహిత్య పుస్తకాలు, ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన 600 పుస్తకాలు సమకూర్చాను. చదవు అంటే ఇష్టం. గ్రంథాలయ ఉద్యోగిగా చేరిన నాటి నుంచి నిరుద్యోగులను విజేతలుగా నిలపాలన్న కాంక్షతో అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను సమకూర్చాను. గ్రంథాలయాన్ని పాఠకులకు అనువుగా శక్తిమేర మలిచాను. లైబ్రరీకి వచ్చే దారి బోసిగా ఉండటంతో... వివిధ రకాల మెుక్కలతో ఆకర్షించేలా తీర్చిదిద్దాను. ఈ మెుత్తం ప్రక్రియలో దాతల సాయం మరవలేనిది.-అట్టాడ అప్పారావు, బాడంగి గ్రంథాలయాధికారి.