Ganja sales in state: వ్యసనాలకు బానిసలుగా మారి డబ్బు కోసం గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ బి. రవికిరణ్ తెలిపారు. విజయవాడ గవర్నర్ పేట పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు గోరా పార్క్ వద్ద గంజాయి కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని.. వారి వద్ద ఉన్న 700 గ్రాముల గంజాయిని సీజ్ చేశామన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు నగరంలో గంజాయి అమ్మకందారులపై ఉక్కు పాదం మోపామన్నారు.
గంజాయి తాగే అలవాటు ఉన్నవారు గంజాయి అమ్మకందారులుగా మారుతున్నట్లు గమనించామని.. వారు విజయవాడ పరిసర ప్రాంతాల్లో గంజాయి సేవిస్తూ.. ఇతరులకు చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారుచేసి అమ్ముతున్నారని ఏసీపీ రవికిరణ్ తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గమనిస్తూ ఉండాలని.. చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా చూడాలన్నారు. నగరంలో గంజాయి సేవిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గంజాయి అమ్మకాలపై నిఘా:ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో గంజాయి ఎక్కడబడితే అక్కడ పట్టుబడుతూనే ఉంది. గతంలో ప్రధాన నగరాల్లో మాత్రమే లభించే గంజాయి.. ఇప్పుడు మారుమూల గ్రామాలకూ పాకింది. గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతుంది. పోలీసులకు వందల కిలోల గంజాయి పట్టుబడుతుంటే వారి కళ్లుగప్పి వేలాది కిలోల అమ్మకాలు జరుగుతున్నాయి. మహిళలలు కూడా గంజాయి అమ్మకాల్లో పాల్గొంటున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. ఇకపోతే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు నగరంలో పోలీసు యంత్రాంగం గంజాయి అమ్మకందారులపై ఉక్కుపాదం మోపింది.