మావోయిస్టులకు సహకరించడం వల్ల ఎటువంటి అభివృద్ధి సాధించలేరని గిరిజనులకు విశాఖ జిల్లా ఓఎస్‌డీ సతీష్ కుమార్ సూచించారు. మన్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బలపం పంచాయతీ చెరువూరు గ్రామంలో యువహో కార్యక్రమంలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం, మెగా వాలీబాల్ టోర్నమెంట్‌ను సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓఎస్‌డీ సతీష్‌కుమార్ హాజరయ్యారు.
మన్యంలోని 11 మండలాల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రభుత్వ పథకాలను అందరికి అందేలా చూసే బాధ్యతను గ్రామాల్లోని యువత తీసుకోవాలని సతీష్ కుమార్ సూచించారు. మరోవైపు మావోయిస్టులు కనీసం అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా తీసుకురాలేరని చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర నాయుడు అన్నారు. కార్యక్రమం అనంతరం పోలీసు అధికారులు గిరిజనులతో సంహపంక్తి భోజనం చేశారు.