తెదేపా తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి వైకాపాకు అనుబంధంగా కొనసాగుతామంటూ వలస వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలకు.. వారి నియోజకవర్గాల్లో సెగ పెరిగింది. వారి పరిస్థితి ఉండలేక, వెళ్లలేక అన్నట్లుగా ఉంది. పార్టీ అధిష్ఠానం నుంచి మద్దతు లభిస్తుందనుకున్న వారికి ఆశాభంగం తప్పడం లేదు. ఈ నలుగురిలో ఒకరైన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నియోజకవర్గ సమన్వయ బాధ్యతల నుంచి శనివారం వైదొలిగారు.
అప్పట్లో గణేష్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి వైకాపాకు మద్దతు ప్రకటించాక ఆయనకు విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను అధినాయకత్వం అప్పగించింది. అప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ తనయుడు ద్రోణంరాజు శ్రీవాత్సవ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలో నలుగురు కార్పొరేటర్లను కూడా ఆయన గెలిపించుకున్నారు.
‘నామినేటెడ్ పదవి ఇవ్వడంతో పాటు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్న పార్టీ అధినాయకత్వం ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పచెప్పడేమిటి’ అని శ్రీవాత్సవ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాసుపల్లి, శ్రీవాత్సవలు ఎవరి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు.
మరో పక్క పార్టీ నేత సుధాకర్‌ను బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నిమమించారు. విశాఖ దక్షిణలో కార్యకలాపాలు చేపట్టేందుకు వైకాపా అధినాయకత్వ ప్రతినిధి ఒకరు ఆయనను ప్రోత్సహించారు. శ్రీవాత్సవ కొంత నిదానించడంతో నలుగురు కార్పొరేటర్లతో కలిసి సుధాకర్ కార్యకలాపాలు ముమ్మరం చేశారు. సహజంగా అసమ్మతి స్వరాలు వినపడడానికి అవకాశం ఏర్పడింది. వాసుపల్లిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు పెడుతున్నారు. అధినాయకత్వం నుంచి ఆయనకు మద్దతు కొరవడిందన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో వాసుపల్లి బాధ్యతల నుంచి వైదొలిగారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
గన్నవరంలో గరంగరంగానే..వైకాపాకు మద్దతు తెలిపిన మరో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరం నియోజకవర్గంలో తొలి నుంచి వైకాపా నేతలతో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక వైకాపా నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావులు ఎమ్మెల్యేతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు.
ఒకటి రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రే కలగజేసుకుని సర్దుబాటు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇటీవల వెంకట్రావు కొద్దిగా నెమ్మదించారు. దుట్టా మాత్రం ఎమ్మెల్యేతో కలిసి పనిచేసేదే లేదని అధినాయకత్వానికే తేల్చి చెప్పేశారు. దుట్టా అల్లుడు శివభారతరెడ్డితోనూ వంశీకి తరచూ వివాదాలు తప్పడం లేదు.
చీరాల కరణంకు ఉంటుందా?..చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం వైకాపాకు మద్దతు ప్రకటించారు. ఆయన కొడుకు వెంకటేష్ నియోజకవర్గంలో వైకాపా తరపున పనిచేసుకుంటున్నారు. మరోపక్క అదే నియోజకవర్గం నుంచి 2019లో వైకాపా తరపున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ పోటీగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అధినాయకత్వం పలుమార్లు చర్చలు జరిపి ఆయనను పర్చూరుకు పంపించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇటీవల ముఖ్యమంత్రి ఆమంచిని పిలిపించి మాట్లాడి పర్చూరుకు వెళ్లాలని చెప్పినట్లు సమాచారం.