విశాఖ తూర్పునియోజకవర్గంలో ఇష్టారీతిన ఓట్లు తొలగింపు YSRCP Government Removes opposition Votes: ఇప్పటికే పంచాయతీ, నగర, పురపాలక ఎన్నికల్లో వివిధ రూపాల్లో అక్రమాలకు తెరలేపిన అధికార వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లపై కన్నేసింది. విచ్చలవిడిగా, లెక్కాపత్రం లేకుండా తమకు పడవనుకున్న ఓట్లను పీకేస్తోంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఏడాదిన్నరలోనే 40 వేల ఓట్లను తీసి పారేసింది. ఎలాంటి నోటీసులు, సమాచారం లేకుండానే.. వాలంటీర్ల సాయంతో ప్రతిపక్షాల ఓట్లను ఏరి పారేస్తోంది.
40 వేల ఓట్ల తొలగింపు : విశాఖ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు ఇక్కడి నుంచే వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతిపక్షానికి కీలకమైన ఈ నియోజకవర్గంలో ఏడాదిన్నరలోనే ఒకటో రెండో కాదు.. ఏకంగా 40 వేల ఓట్లు తొలగించారు. జాబితాలో ఓ వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువసార్లు ఉందంటూ కొన్ని, చనిపోయారంటూ ఇంకొన్ని, వలస వెళ్లారంటూ మరికొన్ని ఓట్లు తీసిపారేశారు. ఐతే ఓట్లు తీసేసిన వారిలో 90 శాతానికిపైగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, మద్దతుదారులే ఉన్నారు. అనర్హులను తొలగిస్తున్నామంటూ పైకి చెబుతూ.. ప్రతిపక్షానికి మద్దతిస్తున్న వారి ఓట్లను తీసేశారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో వాలంటీర్లు ఈ ప్రక్రియను ముందుండి నడిపించారు.
విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఓటర్ల వివరాలు
- 2022 జనవరి నాటికి 2లక్షల 73వేల 699 మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు.
- 2023 జనవరి నాటికి ఆ సంఖ్య కాస్త 2 లక్షల 56వేల 722కి చేరింది.
- 2023 మే నాటికి అది కాస్తా 2 లక్షల 50 వేల 612కి తగ్గింది.
పైన తెలిపిన వివరాలను బట్టి 2022 జనవరి నుంచి ఇప్పటివరకు 40 వేల మంది ఓట్లను తొలగించేశారు. కొత్తగా 15వేల 792 మందిని జాబితాలో చేర్చారు. నియోజకవర్గంలోని 20వ నెంబర్ పోలింగ్ కేంద్రం పరిధిలో 2022 జనవరి నాటికి 944 మంది ఓటర్లు ఉండగా.. ఈ ఏడాది జనవరికి ఆ సంఖ్య 463కి తగ్గింది. ఏడాది వ్యవధిలో 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు తీసేశారు. 104వ నెంబర్ పోలింగ్ కేంద్రం పరిధిలో 2022 జనవరి నాటికి 808 ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 300కి తగ్గిపోయింది. అంటే ఏడాదిన్నరలోనే 508 ఓట్లు తొలగించేశారు. 2022 జనవరితో పోల్చితే 2023 నాటికి 29వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో 187, 33వ నెంబర్ కేంద్రంలో 286, 61వ నెంబర్ కేంద్రంలో 226, 77వ నెంబర్ కేంద్రంలో 191, 116 వ నెంబర్ కేంద్రంలో 308 ఓట్లను తొలగించేశారు.
ఓ ఉద్యమంలా ఓట్లను తీసేశారు : తొలగించిన ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాలే. అలాగే అరిలోవ లీలా సుందరయ్యనగర్‌లోని 24వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో 2022 జనవరితో పోల్చితే 2023 జనవరికి 325 ఓట్లు తీసేశారు. ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో పోలయ్యే ఓట్లలో 90 శాతం తెలుగుదేశం పార్టీకే పడుతుంటాయి. అందువల్లే ఉద్దేశపూర్వకంగా తమ ఓట్లు తొలగించారని స్థానికులు చెబుతున్నారు. భర్తది ఉంటే భార్యది, తల్లిదండ్రులవి ఉంటే కుమారులవి, కొన్నిచోట్ల అందరివీ తీసేశారు. ఇలా ఇష్టారీతిన ఓ ఉద్యమంలా ఓట్లను తీసిపడేశారు.
వాలంటీర్ల సాయంతో పెద్ద ఎత్తున : జాబితా నుంచి ఓ వ్యక్తి ఓటు తొలగించాలంటే కుటుంబసభ్యులకు నోటీసిచ్చి సమాధానం తీసుకోవాలి. అది సహేతుకంగా లేని పక్షంలోనే తొలగించాలి. జాబితాలో రెండు చోట్ల పేరుంటే ఎక్కడ ఓటు తొలగించాలో సదరు వ్యక్తికి నోటీసిచ్చి అడగాలి. బూత్‌స్థాయి అధికారులే ఇవన్నీ చేయాల్సి ఉంది. ఐతే వీరు వైసీపీ నేతలతో కుమ్మక్కై వాలంటీర్ల సాయంతో పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల ఓట్లను తీసేస్తున్నారు. మరికొంత మంది వాలంటీర్లు తమ వద్ద ఉన్న వివరాలతో విపక్ష పార్టీల సానుభూతిపరులు, మద్దతుదారులే లక్ష్యంగా ఓట్లను ఏరిపారేస్తున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియోజకవర్గమైన ఉరవకొండలోఇప్పటికే ఇలాంటి ఉదంతాలు వెలుగుచూశాయి. తాజాగా విశాఖ తూర్పు నియోజకవర్గంలోనూ ఇలాంటి పద్ధతినే అనుసరిస్తున్నారు.
ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు : అధికార పార్టీకి మద్దతుగా, విపక్షాల ఓట్లను తొలగిస్తుంటే జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అర్హుల ఓట్లు తొలగిస్తుంటే బూత్‌స్థాయి అధికారులు, ఇతర బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా అని నిలదీస్తున్నారు. ఓట్ల గల్లంతుపై ప్రత్యేక అధికారితో సమగ్ర విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మార్చి 24న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. తర్వాత మరోసారి లేఖ రాశారు. అయినా ఎలాంటి స్పందనా లేదు. ఓట్ల తొలగింపు వైఫల్యానికి కలెక్టర్‌ను బాధ్యుడిగా చేసి ఆయన సర్వీసు రికార్డుల్లో ఆ వివరాలు నమోదు చేసేలా ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటేనే.. ఇలాంటివి పునరావృతం కావని కొందరు నిపుణులు స్పష్టంచేస్తున్నారు.