YSRCP Government Ignoring Visakha Railway Zone Establishment: రైల్వే జోన్ ఏర్పాటుపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. అయితే చాలాకాలం తర్వాత కార్యాలయాల నిర్మాణానికి కేంద్రం సిద్ధమైనా.. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వ ధోరణే అడ్డంకిగా మారింది. దీంతో జోన్ హామీ కార్యరూపం దాల్చడం లేదు. గతంలో తీసుకున్న రైల్వే భూములకు ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న భూములు ఇవ్వాలని రైల్వేశాఖ కోరుతున్నా.. ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. మా భూములు అప్పగించండి అంటూ రైల్వే అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. జగన్ సర్కారు పట్టించుకోకుండా తీవ్రజాప్యం చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికారపార్టీకి చెందిన కీలక నేతల భూముల్లోంచి దారి ఇవ్వాలనే.. భూములు అప్పగించకుండా జాప్యం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక మాత్రమే కాదు.. రాష్ట్ర విభజన హామీల్లో ముఖ్యమైన వాటిలో ఒకటి . ఇందుకోసం గత తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా పోరాడింది. దీంతో దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు 2019 ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించింది. జోనల్ కార్యాలయాలు, ఇతర భవనాలకు 2020-21 కేంద్ర బడ్జెట్‌లో 170 కోట్లు కేటాయింపులు చేశారు.
విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోనల్ కార్యాలయ నిర్మాణానికి 106కోట్ల నిధులు
బడ్జెట్ కేటాయించి ఏం లాభం ఇప్పటివరకు ఒక్క ఇటుకా పేర్చలేదు. తొలుత విశాఖపట్నం రైల్వేస్టేషన్ సమీపంలోనే భవనాలు నిర్మిస్తామని డీపీఆర్ సిద్ధమైందని, శంకుస్థాపన చేస్తామని చెప్పింది. తర్వాత ముడసర్లోవలో రైల్వేకి చెందాల్సిన 52 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తామని ప్రకటించింది. దీంతో వ్యవహారం మొదటికొచ్చింది. వాస్తవానికి విశాఖలో బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ రహదారి నిర్మాణానికి 2010-11లో రైల్వేకి చెందిన ప్రస్తుత డీఆర్‌ఎం కార్యాలయం, మర్రిపాలెం తదితర చోట్ల సుమారు 15 ఎకరాలను మహా విశాఖ నగరపాలక సంస్థ తీసుకుంది. వీటికి బదులు ముడసర్లోవలో 52 ఎకరాలు ఇచ్చేందుకు అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు. తర్వాత భూములను రైల్వేశాఖకు అప్పగించలేదు.