YSRCP Government Adjusts Vacancies of Professor Without Filling :"ఏపీకి ఆంధ్ర విశ్వవిద్యాలయం గర్వకారణం.. విశిష్ట మేధావుల్ని అందించిన ఈ మహోన్నత వర్సిటీ దేశంలోనే 14 వ స్థానంలో ఉండడం కాస్త అసంతృప్తి కలిగిస్తోంది.. బోధనా సిబ్బంది ఖాళీలు 459 వరకు ఉన్నాయని ఉపకులపతి ప్రసాద్ రెడ్డి చెబుతున్నారంటే ప్రభుత్వం తలదించుకునే పరిస్థితి నెలకొంది.."2019 డిసెంబరు 13న విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సీఎం జగన్ చెప్పిన మాటలివి.
CM Jagan Play with Student Future :వర్సిటీలో 459 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉండడం సిగ్గుచేటన్న ఆయన వాటిని వెంటనే భర్తీ చేస్తామని ఆశపెట్టారు. కానీ నాలుగు సంవత్సరాలైనా భర్తీ చేయలేదు సరి కదా రేషనలైజేషన్ పేరుతో 200 పోస్టులను రద్దు చేసి.. ఇతర వర్సిటీలకు మళ్లించేశారు. బహుళ కోర్సుల విధానం ప్రవేశ పెట్టాలని జాతీయ విద్యా విధానం చెబుతుంటే ఉన్న వాటినే రద్దు చేసిన సీఎం జగన్.. విద్యార్థుల భవిష్యత్‌ను అంథకారంలోకి నెట్టారు.
CM Jagan Forgot Promises to Andhra University :ఉన్నత విద్యా విధానంపై సరైన ఆలోచనలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. విశ్వవిద్యాలయాలకు ప్రాణావసరమైన పోస్టుల్లో ఖాళీలను భర్తీ చేయకుండా, ఉన్నవాటినే సర్దుబాటు చేసేసి చేతులు దులిపేసుకుంది జగన్ సర్కారు. హేతుబద్ధీకరణ పేరు చెప్పి వర్సిటీల్లోని చాలా విభాగాలను రద్దు చేసింది. మరికొన్నింటిని ఇతర వాటిల్లో విలీనం చేసింది. దీని వల్ల చాలా వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు లభించాల్సిన బ్యాక్‌లాగ్ పోస్టులు పోయాయి.
నా ఎస్సీ, నా ఎస్టీ అని పదే పదే గొంతు చించుకునే సీఎం జగన్ మోహన్ రెడ్డి వారికి ఉద్యోగాలకే ఎసరు పెట్టారు. యోగివేమన లాంటి వర్సిటీలో మెటలర్జీ, మెటీరియల్ టెక్నాలజీ విభాగాన్ని మూసేయడంతో ఒక బ్యాక్‌లాగ్ పోస్టు పోయింది. చాలా వర్సిటీల్లో ఇదే పరిస్థితి. బహుళ కోర్సుల విధానం తీసుకొచ్చి, విద్యార్థులకు ఐచ్ఛికాలు పెంచాల్సి ఉండగా.. ఆర్థిక భారం తగ్గించుకునేందుకే జగన్ సర్కారు సర్దుబాటు పేరుతో ఉన్నత విద్య వ్యవస్థకు చెదలు పట్టించింది.
CM Jagan Meeting With VCs: విశ్వవిద్యాలయాల అభివద్ధిపై జగన్ సమావేశం.. ప్రపంచ స్థాయి వర్సిటీలతో పోటీ పడాలంటూ డాంబికాలు
జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను సమ్మిళిత విద్య, పరిశోధన వర్సిటీలుగా మారుస్తామని ఉన్నత విద్యామండలి రెండేళ్ల క్రితం ప్రకటించింది. అన్నిరకాల కోర్సులనూ అందుబాటులోకి తీసుకొస్తామంది. విద్యార్థులు నచ్చిన కోర్సుల్లో చదువుకోవచ్చంటూ ప్రచారం చేసింది. మొదటి విడతలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ-కాకినాడ, జేఎన్‌టీయూ-అనంతపురం, శ్రీవేంకటేశ్వర, రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం లో అమలు చేస్తామని వెల్లడించింది. తీరా చూస్తే.. హేతుబద్ధీకరణ పేరుతో ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర వర్సిటీల్లోని విభాగాలను రద్దు చేసి, పోస్టులను తొలగించేసింది. అవసరం లేదంటూ పోస్టులను మళ్లించేస్తే.. అంతర్జాతీయ ప్రమాణాలు సాధించడం, బహుళ కోర్సుల విధానం అమలు ఎలా సాధ్యమవుతుందని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు.