విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబు) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. లాలంకోడూరు పంచాయతీలోని ఓ వార్డులో పోటీచేస్తున్న అభ్యర్థి అల్లుడిని బెదిరించిన కేసులో శనివారమే పోలీసుస్టేషన్‌లో హాజరై 41ఏ సీఆర్‌పీసీ నోటీసు అందుకుని వచ్చారు. అదే మండలంలోని రాజకోడూరు ఎన్నికల ప్రచార సభలో ప్రజలను బెదిరించేలా మాట్లాడటం వివాదాస్పదంగా మారింది.తాను బలపర్చిన అభ్యర్థిని గెలిపించకపోతే మున్ముందు ఏం జరుగుతుందో మీకే తెలుస్తుందని, బాధలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు.
ఆ గెలిచినోణ్ని కింద కూర్చోపెట్టడమే..!
ఆ వివరాలు ఆయన మాటల్లోనే..‘నేను నిలబెట్టిన సర్పంచి అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మీది. మీరు గెలిపించలేదనుకోండి, రెండోసారి మీకొచ్చేవన్నీ ఇంకోలా ఉంటాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి తర్వాత నేనే.. మధ్యలో ఇంకా ఎవరూ ఉండరు. పింఛను, రేషన్‌కార్డు, ఇళ్లు ఇవ్వాలన్నా ఏదైనా నేనే ఇవ్వాలి. ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. రేపు ఇళ్లు కట్టుకోవాలి కదా.. కట్టుకోవాలంటే నీళ్లుండాలి. రోడ్లు, కాలువలు, కరెంటు రావాలా.. ఇవన్నీ ఎవరిస్తారు? ఎమ్మెల్యేనే. అందువల్ల మీరు అన్నివిధాలా ఆలోచించుకోండి. అతనికి ఏదైనా తేడా వచ్చి ఓడిపోయాడనుకోండి.. ఆ గెలిచినోణ్ని కిందన కూర్చోపెట్టడమే తప్ప ఆఫీసులో కుర్చీ కూడా ఉండదు. గ్రామ సచివాలయం బిల్డింగ్ కడుతున్నారు.. శ్లాబ్ వేశారు. తేడా వస్తే ఈ అయిదు సంవత్సరాలూ అలాగే ఉంటుంది.. ఓపెనింగ్ కూడా ఉండదు. మంచినీళ్లు, పైపులైను.. ఏ ఒక్క పనీ చేయనివ్వను. క్లియర్‌గా చెబుతున్నాను.. సర్పంచి విషయంలో ఏమైనా తేడా వచ్చిందా.. మీరందరూ నడుచుకుని రావాల్సిందే నా దగ్గరికి. అయినా సరే నేను కనికరించను. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దేవుడు చెప్పినా ఆలకించను.
వాళ్లకి నరకం అంటే ఏంటో చూపిస్తా..
శంకర్రావు, ఆదినారాయణ వారిద్దరూ చంద్రబాబు మనుషులు. వాళ్లు నా దగ్గరకు వచ్చినప్పుడే చెప్పాను ఏ పదవీ ఇవ్వనని. వాళ్లకి నరకం అంటే ఏంటో చూపిస్తాను. మరోసారి చెబుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిలబెట్టిన రావి చిరంజీవిని గెలిపించాల్సిందే. అతనే మీకు సర్పంచి. గెలిచినా.. ఓడినా ఈ అయిదేళ్లూ అతనే సర్పంచి. పట్టాలిచ్చేశారు.. మీకు వచ్చేశాయని కాదు.. మిగిలినవన్నీ మైకులో మాట్లాడకూడదు. తర్వాత చూపిస్తాను నేను. కన్నబాబంటే ఎంత మంచిగా ఉంటానో.. అంత దుర్మార్గుణ్ని నేను. అలా ఉంటాను కాబట్టే నన్ను మూడోసారి గెలిపించారు. మంచి చేస్తాననే నమ్మకం ప్రజలకుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలెవరూ చేయని పనులు నేను చేస్తుంటాను. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఇక్కడ అన్ని పార్టీల్లో పెద్ద పెద్ద వాళ్లందరూ కలిసినా నన్ను ఏమీ చేయలేకపోయారు’ అని మాట్లాడటంతో అక్కడివారిలో ఆందోళన వ్యక్తమైంది.