'ఫ్యాషన్ డిజైనింగ్‌లో నంబర్ వన్' సామాజిక అంశాలపై ఆసక్తి కొద్దీ మరో లక్ష్యానికి చేరువైన తులసి Youngster Transforms Her Career from Fashion Designing to Film Making: మొదట్లో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంపై ఉన్న ఆసక్తినే కెరీర్‌గా ఎంచుకుంది ఆ యువతి. అక్కడితో ఆగకుండా మోడల్ కోసం ప్రత్యేకంగా రూపొందించి పోటీల్లో అగ్రస్థానంలో నిలిచేలా చేసింది. అయినా వృత్తిలో అసంతృప్తి వెంటాడి.. సమాజానికి తన వంతుగా ఏదైనా చెప్పాలనుకుంది. జనాలలో ఆదరణ ఉన్న ప్లాట్‌ఫాం ద్వారా సందేశం అందించాలనుకుంది. దానిపై కసరత్తులు ముమ్మరం చేసింది.
ఈ యువతి పేరు బొంగరాల తులసి. విశాఖపట్నం స్వస్థలం. చిన్నప్పటి నుంచి అలంకరణ విషయంలో కొంత ఆసక్తిగా ఉండేది ఈ యువతి. ఆ ఇంట్రెస్ట్‌తోనే ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ చేసింది. మోడళ్ల కోసం సృజనాత్మకంగా ప్రత్యేకమైన దుస్తులు రూపకల్పన చేసి అనేక పోటీల్లో అగ్రస్థానంలో నిలిచేట్టుగా చేయగలిగింది.
అంతర్జాతీయ జల సదస్సులో 'ఫ్లాష్ మాబ్' - ప్రతినిధుల మెప్పు పొందిన 'ఆంధ్ర' విద్యార్థుల మైమ్
ఎప్పటికప్పుడు కొత్తదనంతో ఉండే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో కొంత కాలంపాటు రాణించింది. క్రమంగా ఆసక్తి కాస్త సామాజిక అంశాలపై మళ్లింది. ఆమెకు లఘుచిత్ర నిర్మాణంతో సందేశం ఇవ్వాలన్న కోరిక కలిగింది. ఇదే సమయంలో షార్ట్ ఫిల్మ్ ల రూపకల్పన కోసం కొన్ని సందేశాత్మక ఆలోచనలను సిద్ధం చేశానంటోందీ యువదర్శకురాలు.
ఇందుకోసం ఈ యువతి క్షేత్రస్థాయిలో తిరిగి దానిపై పట్టు సంపాదించింది. మారుతున్న భూవాతావరణ పరిస్థితులు, ప్రజల నివాసాలు, ఆహారాలు, అనుసరిస్తున్న పద్ధతులు వంటి వాటిని సమగ్రంగా పరిశీలించింది. నిపుణులను కలిసి అవసరమైన వివరాలు అడిగి తెలుసుకుంది. మిగిలిన సమాచారాన్ని ఇంటర్నెట్లో సేకరించి ఒక అవగాహనకు వచ్చింది.
మామూలుగా మనం చూసే సినిమాల్లో, షార్ట్ ఫిల్మ్స్‌లో చెప్పాలనుకున్నది మాటలతో, సన్నివేశాలతో కలిపి చెప్పేస్తారు. కానీ తులసి ఇక్కడ భిన్నమైన విధానాన్ని ఎంచుకుంది. డైలాగ్స్ లేకుండా సన్నివేశాలతో పాటు నేపథ్య సంగీతం, ఆర్ట్, ఫోటోగ్రఫీ ఈ మూడింటిపై ఫోకస్ పెట్టింది. ప్రధానంగా వీటినే వందశాతం వాడుకొని లఘు చిత్రాన్ని రూపొందించాలని ప్రణాళికలు రచించింది.
కరాటేలో 74 పతకాలు సాధించిన సందీప్ కుమార్ - పల్లె నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన యువకుడు
వినూత్నమైన ఆలోచనతో ఒక సందేశాత్మక లఘు చిత్రాన్నిఅందించేందుకు అహర్నిశలు శ్రమిస్తోందీ యువ దర్శకురాలు. ముఖ్యంగా తాను ఏదైతే విశ్వసిస్తుందో అదే సమాజానికి చెప్పాలనుకుంటుంది. మారుతున్న భూతాప పరిస్థితులు, అంతర్జాతీయంగా భూగోళ పరిరక్షణ, భారతీయ గ్రామీణ, అటవీ తదితర అంశాలను తాను తీసే చిత్రానికి కథా వస్తువుగా తీసుకుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది.
అంతర్జాతీయ గుర్తింపే లక్ష్యంగా కృషి చేయాలని నిర్ణయించుకుంది. ఎంత కష్టపడ్డా చివరకు తన లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపనే తనని ముందుకు నడిపిస్తోంది. ఇందులో సలహాలు, సూచనల కోసం పలువురి సహకారం తీసుకొని ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంది. తప్పకుండా వీలైనంత తొందరగా వచ్చే అంతర్జాతీయ స్థాయిలో తన సందేశాత్మక లఘు చిత్రం పోటీలో ఉంటుందని వివరించింది తులసి.
గతంలో జరిగిన ప్రపంచ స్థాయి గుర్తింపు పోటీల్లో ప్రయత్నాలు ఎంత వరకు ఫలించాయన్నది కూడా తులసి అంచనా వేసుకుంటోంది. తులసి ముందున్న ఏకైక లక్ష్యం లఘు చిత్రాన్ని రూపొందించడం. ప్రపంచం మెచ్చే స్థాయిలో అంతర్జాతీయ అవార్డును పొందేలా భారత కీర్తిపతాకం ఎగురవేసేలా తన ప్రయాణం కొనసాగాలని ఆశిద్దాం.
Bezawada Brothers Success Story: ఇష్టపడిన రంగంలో కష్టపడుతూ ఉన్నతశిఖరాన..! 'బెజవాడ బ్రదర్స్' చాలా ఫేమస్ గురూ..!