Young Woman Stuck Between Rocks at Visakha Appikonda Beach: విశాఖలో శివారు అప్పికొండ సాగర తీరంలో రాళ్ల గుట్టల మధ్య ఓ యువతి చిక్కుకొని 12 గంటల పాటు నరక యాతన అనుభవించిన ఘటన చోటుచేసుకుంది. కాగా ఆ యువతి ఇంట్లో నుంచి పారిపోయి.. తన ప్రియుడితో తాళిబొట్టు కట్టించుకుని ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి సాగర తీరం వద్దకు వెళ్లిన ఆ యువతి.. రాళ్ల గుట్టలపై ఫొటో తీసుకుంటుండగా.. ఎత్తు ప్రదేశం నుంచి జారి పడిపోయింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన విశాఖలో సంచలం రేకిత్తిస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ యువతి (18) మరో యువకుడితో కలిసి అప్పికొండ శివాలయ పరిసరాల్లో ఈ నెల 2వ తేదీ నుంచి ఉంటున్నారు. కాగా ప్రియుడితో కలిసి ఆదివారం సాయంత్రం సాగర తీరం వద్దకు వెళ్లిన ఆమె ఫొటో తీసుకుంటుండగా.. ఎత్తు ప్రదేశం నుంచి జారి పడిపోయింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుంది. కాగా ఆ యువతి మరణించిందని భావించిన యువకుడు.. ఆమెను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
DEADBODY: విశాఖ బీచ్‌లో మహిళ మృతదేహం.. దుస్తులు సరిగా లేని స్థితిలో
జన సంచారం లేని చిమ్మ చీకటి ప్రదేశంలో రాత్రంతా ఆ యువతి మృత్యువుతో పోరాడింది. రాత్రంతా ఆ రాళ్ల మధ్యన ఒక కొండరాయిని పట్టుకుని ఆమె తన ప్రాణాలను నిలుపుకొంది. సోమవారం ఉదయం బీచ్‌కు వచ్చిన కొందరు వ్యక్తులు ఆమె చూసి.. అక్కడే ఉన్న గజ ఈతగాళ్ల సహయంతో యువతిని ఒడ్డుకు తీసుకుని వచ్చారు. మొదట ఆమెకు మంచినీరు ఇచ్చి కాస్త సేద తీరేలా చేశారు. ఈ ప్రమాదంలో యువతి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సరిగా నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెను ఇసుక తిన్నెల మీదుగా ఒక డోలిని ఏర్పాటు చేసి స్థానికులు ఆమెను చికిత్స మేరకు 108 అంబులెన్సు వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు.
ఈ ప్రమాదంపై యువతి తల్లికి అంబులెన్సు సిబ్బంది సమాచారం ఇవ్వగా.. వారు వెంటనే విశాఖ బయలుదేరి వస్తున్నట్లు తెలిపారు. అయితే తమ కుమార్తె కనబడటంలేదని వారు బందరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు యువతి తల్లి చెప్పారు. ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు బందరు పోలీస్ స్టేషన్ నుంచి అంబులెన్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. దీనిపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కాలుజారి పడిపోయానని, పరారీలో ఉన్న యువకుడిని ఏం అనవద్దని యువతి చెబుతోంది. మరోవైపు పరారీలో ఉన్న యువకుడు రోడ్డు ప్రమాదంలో చిక్కుకుని.. అతడు కూడా కేజీహెచ్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
సాగరతీరానికి కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం.. ఆత్మహత్యేనా?