RESEARCH ON SEED DEVELOPMENT: పుస్తకాన్ని దీర్ఘంగా పరిశీలిస్తున్న ఈ యువకుడు.. పాపారావు. చదువుతున్న పుస్తకం.. వ్యవసాయ పరిశోధనల గురించి. ఈ వయసు వారు సాఫ్ట్‌వేర్ కొలువులంటూ కార్పొరేట్ బాట పడుతుంటే.. తను మాత్రం పొలం బాట పట్టాడు. రైతుల కష్టాల్ని దగ్గురుండి చూసిన అనుభవంతో.. వారి ఆదాయం రెట్టింపు చేయాలనే ఉన్నతమైన లక్ష్యంతో నూతన వంగడాల తయారీకి కృషి చేస్తున్నాడు.
పాపారావు స్వస్థలం.. విజయనగరం జిల్లా మక్కువ మండలం చప్పబుచ్చింపేట. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఇతడికి.. పొలం కష్టాలేంటోతెలుసు. ఈ యువకుడి విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగింది. ఉన్నత విద్య ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదవాలనుకున్నాడు. అందుకు అనుగుణంగా కష్టపడి.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు దక్కించుకున్నాడు. పీజీలో ప్లాంట్ బయోటెక్నాలజీ కోర్సులో చేరాడు.
తన ప్రతిభతో... ప్రొఫెసర్లతో పాటు వ్యవసాయ రంగ నిపుణుల మన్ననలు పొందాడు పాపారావు. అంతటితో సంతృప్తి చెందక వ్యవసాయ విద్యలో మరింత ప్రావీణ్యం సాధించాలని., పరిశోధనల బాట పట్టాడు. అగ్రికల్చరల్ సైంటిస్టు రిక్రుట్మెంట్ బోర్డు నిర్వహించే జాతీయస్థాయి అర్హత పరీక్షలో మెరుగైన ర్యాంకు సాధించి.. దిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్- ఐసీఎంఆర్ లో సీటు సంపాదించాడు. పరిశోధనల్లో భాగంగా.. ఇండో జపాన్ సంయుక్త బృందంతో కలిసి పని చేసిన పాపారావు.. తన ప్రతిభతో ఐసీఎంఆర్ లోనే శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించాడు. మేటి వ్యవసాయ పరిశోధనలతో ఏపీ అకాడమీ ఆఫ్ సైన్స్ నుంచి యువ శాస్త్రవేత్త అవార్డును సొంతం చేసుకున్నాడు.