వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి జోడు పదవుల విషయంలో అనర్హత వర్తించదంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి... దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా లాభదాయక పదవిలో ఉన్నారని... ఈ నేపథ్యంలో అనర్హత వర్తింపజేయాలంటూ సీహెచ్ రామకోటయ్య ఫిర్యాదు చేశారు.
రామకోటయ్య ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రపతి పంపారు. పార్లమెంట్(అనర్హత నిరోధక)చట్టం 1959 నిబంధనల ప్రకారం అనర్హత వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతికి తెలిపింది. ప్రత్యేక ప్రతినిధిగా ఎలాంటి జీతభత్యాలు తీసుకోనందున ఆఫీస్ ఆఫ్ ప్రాపిట్ కింద పరిగణించలేమని వివరించింది. ఈసీ అభిప్రాయం మేరకు ఎంపీ విజయసాయిరెడ్డికి అనర్హత వర్తించదంటూ రాష్ట్రపతి కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.