తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును వైకాపాలో చేర్చుకుంటే సహించేదిలేదంటూ విశాఖ జిల్లాలోని భీమునిపట్నం, తగరపువలస వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. విశాఖ జిల్లా తగరపువలస అంబేడ్కర్ జంక్షన్లో గంటా ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారంలా నిల్చొన్నారు.
తెదేపా హయాంలో వైకాపా నాయకులు, కార్యకర్తలను గంటా ఎన్నో ఇబ్బందులు పెట్టారని భీమునిపట్నం, తగరపువలసకు చెందిన వైకాపా కార్యకర్తలు ఆరోపించారు. పద్మనాభం మండలం చిన్నాపురంలో రాత్రికి రాత్రి వైఎస్సార్ విగ్రహాన్ని 200 మంది పోలీసులు బందోబస్తుతో తీసివేయించారని అన్నారు. అవినీతి, అక్లమాలు, భూకబ్జాలకు గంటా కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. గంటాను పార్టీలోకి తీసుకుంటే పార్టీకి చెడ్డపేరు వస్తోందన్నారు. అధిష్ఠానం గంటా చేరిక విషయంలో పునరాలోచించి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా నిర్ణయం తీసుకోవాలన్నారు.