YCP leader sub leased temple land: విశాఖపట్నం జిల్లాలోని పరదేశమ్మ అమ్మవారి దేవాలయానికి వంద కోట్ల రూపాయిలు విలువ చేసే 16 ఎకరాలు ఉంటే ఇందులో ఎకరం భూమిని ఆక్రమించిన వైఎస్సార్సీపీ నేత కుటుంబ సభ్యుడికే దేవాదాయ శాఖ లీజుకు కట్టబెట్టారు. అతడు చెల్లిస్తానని చెప్పిన మొక్కుబడి ఫీజు మొత్తానికి అంగీకరించి రూ. 10 కోట్ల భూమిని అప్పగించేశారు. నెలకు రూ.20 వేలు చొప్పున లీజుగా ఆలయానికి చెల్లిస్తున్న అతడు ఆ స్థలాన్ని అందులోని ఐస్‌క్రీమ్ తయారీ యూనిట్‌కి అద్దెకు ఇచ్చి నెలకు రూ.లక్షలు తీసుకోవడం తాజాగా వెలుగు చూస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గాజువాక నుంచి అనకాపల్లి వైపు వెళ్లే జాతీయ రహదారికి ఆనుకొని లంకెలపాలెంలో పరదేశమ్మ అమ్మవారి ఆలయానికి సర్వే నెంబర్ 189లో 10.17 ఎకరాల భూమి ఉంది. అక్కడ ఎకరం రూ. పది కోట్లు ఉంది. ఈ భూమి రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో ఉంది. కొందరు గతంలో దీన్ని ఇతరుల నుంచి కొనుగోలు చేశామంటూ ఆధీనంలోకి తీసుకొన్నారు. దీంతో దేవాదాయ అధికారులు స్పందించి అది పరదేశమ్మ ఆలయ భూమి అంటూ అక్కడ బోర్డులు సైతం ఏర్పాటు చేశారు.
అయితే, అక్కడ ఒక ఎకరంలో రాయల్ లైన్ ఐస్ క్రీమ్ తయారీ యూనిట్‌ను వైఎస్సార్సీపీ కీలక నేతకు చెందిన బంధువు నిర్వహిస్తున్నారు. ఇది ఖాళీ చేయించాల్సిన పరదేశమ్మ అమ్మవారి ఆలయ అధికారులు, ఆయనకే దానిని లీజుకిచ్చారు. ఎకరం భూమిని తనకు లీజుకు ఇవ్వాలంటూ ఐస్‌క్రీమ్ తయారీ యూనిట్ యజమాని 2021 డిసెంబరులో దేవాదాయశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్‌గా ఉన్న శాంతి నుంచి నివేదిక కోరగా వెంటనే నివేదిక సిద్ధం చేసి.. కమిషనర్ పంపడం.. తక్కువ సమయంలోనే ఉత్తర్వులు ఇచ్చేయడం జరిగింది.
నెలకు ఇరవై వేల రూపాయిల చొప్పున లీజు చెల్లించేందుకు ముందుకు వచ్చారని, ఇది చాలా ఎక్కువ మొత్తం అని సహాయ కమిషనర్ నివేదికలో ఇచ్చారు. దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్ 11 ఏళ్లకు లీజు మంజూరు చేస్తూ, ఉత్తర్వులు వెలువడ్డాయి. నిబంధనల ప్రకారం.. 11 ఏళ్లు దేవాదాయ స్థలాన్ని లీజుకు ఇవ్వాలంటే టెండరు, బహిరంగ వేలం గానీ నిర్వహించాలి. దీనివల్ల పోటీ వచ్చి, ఎక్కువ అద్దె చెల్లించేందుకు చాలామంది ముందుకొస్తారు. అన్నీ తెలిసినా ఏకపక్షంగా లీజు కేటాయిస్తూ ఆదేశాలిచ్చి నిబంధనలు ఉల్లంఘించారు. మరోవైపు అదే సర్వే నంబరులో మిగిలిన భూమిని ఒక్కో ఎకరం చొప్పున విభజించి, బహిరంగ వేలం నిర్వహించి 11 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని కమిషనర్ తన ఆదేశాల్లో చెప్పడం విశేషం.
ఐస్ క్రీమ్ తయారీ యూనిట్.. అందులో ఉన్న స్థలాన్ని తిరిగి మరో డెయిరీకి సబ్ లీజ్‌కి ఇచ్చినట్టు సమాచారం. ఇందుకుగాను డెయిరీ ఈ ఐస్‌క్రీమ్ యూనిట్ వారికి నెలకు రూ. లక్షల్లో చెల్లిస్తోందని తెలుస్తోంది. ఆయన మాత్రం దేవాదాయశాఖతో చేసుకున్న ఒప్పందం మేరకు నెలకు రూ.20 వేలు మాత్రమే చెల్లించి, మిగిలింది తన జేబులో వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారమంతా ముందే తెలిసే దేవాదాయ అధికారులు ఈ లీజు నడిపారని తెలుస్తోంది. అందుకే బహిరంగ వేలం లేకుండా నేరుగా ఆయనకు లీజుకి ఇచ్చారని విమర్శలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరంలోని విఘ్నేశ్వర ఆలయానికి చెందిన రెండు దుకాణాల లైసెన్స్‌ను 11 ఏళ్లకు రెన్యువల్ చేస్తూ దేవాదాయ కమిషనర్ గత ఏడాది ఉత్తర్వులు జారీ చేశారన్నది వెలుగు చూస్తోంది.
"లంకెలపాలెంలో పరదేశమ్మ తల్లికి చెందిన భూములను ఆక్రమించుకునేందుకు చాలా మంది వైసీపీ నేతలు ప్రయత్నించారు. అయితే వారిని దేవాదాయ శాఖ వారు అడ్డుకున్నారు. అనంతరం మంత్రి అమరనాథ్ ప్రోత్సాహంతో పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అదీప్ రాజు నాయకత్వంలో వైసీపీ స్థానిక నేతలకు ఈ భూమిని వేరే మార్గం ద్వారా ఒక ఎకరాన్ని నెలకు రూ.20 వేల చొప్పున లీజుకు ఇచ్చారు. అయితే అతడు అదే భూమిని విశాఖ డెయిరీ వాళ్లకు నెలకు రూ. 2 లక్షల ముప్పై వేల చొప్పున అక్రమంగా సబ్ లీజుకు ఇచ్చి లాభాలను ఆర్జిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధమైన దీన్ని రద్దు చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది."
- కోన తాతారావు, జనసేన పార్టీ కన్వీనర్
ఇవీ చదవండి