BC-Corporation: రెండేళ్ల క్రితం డిసెంబరు 17న ప్రభుత్వం ‘బీసీల సంక్రాంతి’పేరుతో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించింది. 56 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, ఒక్కో కార్పొరేషన్‌కు 12 మంది చొప్పున డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వెనుకబడిన తరగతులకు ఆర్థిక చేయూత అందించడంలో వెన్నెముకగా నిలబడాలనేది ఈ కార్పొరేషన్ల లక్ష్యం. అయితే నిధులూ, విధులూ లేని ఈ కార్పొరేషన్లతో..ఆ లక్ష్యసాధనలో ఒక్క అడుగు కూడా వేయకుండానే.. రేపటితో వారి పదవీకాలం ముగిసిపోతోంది. ఇది బీసీల ఉపాధి కల్పన చరిత్రలో మునుపెన్నడూ చూడని విషాద ఘట్టం.
వెనుకబడిన తరగతుల వారిని పేదరికం నుంచి శాశ్వత విముక్తి కల్పించేందుకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇచ్చే రాయితీ రుణాలు వారికి గొప్ప అవకాశం. ప్రభుత్వం వివిధ పథకాల కింద ఆర్థిక సాయం, ఆరోగ్య పథకాలు, వృద్ధులకు సామాజిక భద్రతా పింఛన్లు, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నా..శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడేయగలిగేది మాత్రం రాయితీ రుణాలతోనే. దశాబ్దాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలిచ్చాయి. వాటిని వినియోగించుకుని వేల బీసీ కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించి తలెత్తుకుని జీవిస్తున్నాయి. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ పేదరికాన్ని తరిమికొట్టాయి. ఇలాంటి ఘనమైన చరిత్ర ఉన్న బీసీ కార్పొరేషన్, బీసీ కులాల కార్పొరేషన్లను వైసీపీ ప్రభుత్వం నామమాత్రంగా మార్చేసింది. బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ఘనంగా ప్రకటించడమే తప్ప.. గత ప్రభుత్వాలతో పోలిస్తే వాటి ద్వారా స్వయం ఉపాధి కింద రుణాలిచ్చింది చాలా తక్కువ. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలో స్వయం ఉపాధికి 16 వందల26 కోట్ల రుణాలిచ్చారు. వైసీపీ ప్రభుత్వం తాము ప్రాధాన్యంగా భావించిన రేషన్ పంపిణీ వాహనాలకు 132 కోట్లు రాయితీగా ఇచ్చి మమ అనిపించింది. పైగా గత ప్రభుత్వం బీసీలకు రాయితీ రుణాల కింద ఇచ్చి.. బ్యాంకుల్లో మిగిలిపోయిన 200 కోట్లనూ వెనక్కు తీసుకుంటోంది.
కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు గతంలో 20 నుంచి 50 శాతం వరకు రాయితీపై బ్యాంకుల ద్వారా రుణాలు అందించాయి. లక్ష నుంచి 25 లక్షల వరకు రుణాలిచ్చి స్వయం ఉపాధికి ఊతమిచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో యాదవుల అభివృద్ధికి ఫెడరేషన్ ద్వారా కేంద్ర సహకారంతో ఒక్కొక్కరికి 5 లక్షల రుణం అందించింది. ఈ రుణాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ తప్పనిసరి. ఇందులో 20 శాతం రాయితీ, మరో 20 శాతం లబ్ధిదారు వాటా. 60 శాతం పావలా వడ్డీ రుణం. దాదాపుగా 80 కోట్లు ఖర్చు చేసినట్లు బీసీ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇవికాకుండా 50 శాతం రాయితీతో 25 లక్షలు రుణాలిచ్చి మినీ డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు గత ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఉపాధి హామీ పథకం కింద గొర్రెలు, బర్రెలు షెడ్లు ఏర్పాటు చేసుకునేందుకు రుణాన్నిచ్చిందని పేర్కొంటున్నారు. రజకులు, కల్లుగీత కార్మికులు, వడ్డెరలు, నాయీబ్రాహ్మణులు, వాల్మీకి, ఇతర బీసీ కులాలకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి రుణాలు అందాయి. లక్ష రాయితీతో 2 లక్షల వరకు రుణంగా ఇచ్చారు. వీటి ద్వారా వేల సంఖ్యలో లబ్ధిదారులకు మేలు చేకూర్చారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడున్నరేళ్లలో బీసీలకు స్వయం ఉపాధి కల్పన ద్వారా శాశ్వతంగా పేదరికాన్ని దూరం చేసేందుకు ఏం చేశారో చెప్పకుండా అన్ని పథకాల్లోని బీసీలకిచ్చే వాటాను పక్కకు తీసి..పెద్దమొత్తంలో సాయాన్ని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి, మంత్రులు అంకెల గారడీ చేస్తున్నారు. నవరత్న పథకాల నిధుల్నే కార్పొరేషన్ల ద్వారా చూపిస్తూ తిమ్మిని బమ్మిని చేస్తున్నారు. జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం పథకాల ద్వారా బీసీలకే నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్నా..వారిని శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడేసేందుకు కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే స్వయం ఉపాధి రుణాల స్థాయి కాదు. వైసీపీ ప్రభుత్వం వీటితోపాటు అందరికీ అందించే పింఛన్లు, ఉపకార వేతనాలు, బోధనా రుసుములు, వడ్డీ రాయితీ, చేయూత పథకాలనూ బీసీల ఖాతాల్లోనే వేస్తోంది. బీసీల్లోని పేదలకు ఆర్థికసాయం అందించి స్వయం ఉపాధిని ప్రోత్సహించాలనే కార్పొరేషన్ల ఏర్పాటు లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది.