తెలుగు భాష అభివృద్ధి మీద చర్చించేందుకు తాను ఎక్కడికైనా వస్తానని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనతికాలంలోనే తెలుగుభాషాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని స్పష్టం చేశారు. తెలుగు అకాడమీకి, సంస్కృతానికి కలిపి తెలుగు సంస్కృత అకాడమీ అని మార్పు చేస్తే అది నేరమా అని యార్లగడ్డ ప్రశ్నించారు. తెలుగు భాషకు జరిగిన నష్టం ఏమిటో చెప్పగలరా అని అన్నారు.
చంద్రబాబు హయాంలో 2014 నుంచి 19 మధ్య తెలుగు అకాడమీని... అస్తిత్వమే లేకుండా చేశారని ఆయన విమర్శించారు. తెలుగు అకాడమీని పునరుద్ధరించింది జగన్మోహన్రెడ్డేనని స్పష్టం చేశారు. అధికార భాషా సంఘాన్ని జగన్.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తిరిగి ప్రారంభించారని.. ఆ సంఘం 13 జిల్లాలు పర్యటించి, వందలాది మంది రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్షించి వార్షిక నివేదిక సమర్పించిందని చెప్పారు.
తెలుగు అకాడమీకి, సంస్కృతం కూడా జోడిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి సంస్కృత భాషకు ఎక్కువ నిధులు తీసుకువచ్చి, వాటిని రెండు భాషల అభివృద్ధికి ఉపయోగించవచ్చనే విషయం చంద్రబాబుకు తెలియదా అని యార్లగడ్డ ప్రశ్నించారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా దివంగత రాజశేఖర్ రెడ్డి తెచ్చారని.. ప్రాచీన భాషా అధ్యయన కేంద్రాన్ని మైసూర్ నుంచి నెల్లూరుకు తీసుకువచ్చింది జగన్ మోహన్ రెడ్డేనని ఆయన చెప్పారు.