కరోనా మహమ్మారి ఊపిరితిత్తుల్లోకి చేరి ప్రాణాలు తీస్తోంది. ఈ తరుణంలో ఆస్తమా బాధితులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నేడు ‘ప్రపంచ ఆస్తమా దినం’ సందర్భంగా ప్రత్యేక కథనం..!
విశాఖ నగరంలో లక్ష వరకు బాధితులు
గతంలో కంటే ఆస్తమా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతి పది మందిలోనూ ఒకరు ఉంటున్నారంటే దీని తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్ఛు. విశాఖ నగర వ్యాప్తంగా సుమారు లక్ష మంది వరకూ బాధితులు ఉన్నట్లు వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెరుగుతున్న కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పుల వల్ల చిరుప్రాయంలోనే వ్యాధి సోకుతోంది. మూడు నెలల నుంచి అయిదేళ్ల చిన్నారులకు ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది.
వ్యాయామంతో మెరుగైన ఫలితాలు
ఆస్తమా బాధితులు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారని వైద్యులు పేర్కొంటున్నారు. దుమ్ము, ధూళి, పొగ, చల్లగాలి, చల్లటి వస్తువులకు దూరంగా ఉండాలి. వైద్యులు సిఫార్సు చేసిన మందులను మాత్రమే వాడాలి. వర్షాకాలంలో ఎక్కువగా గదిలోకి గాలి రాకుండా కిటికీలను మూసి ఉంచాలి. పిల్లలు ఆడుకునే ఆటబొమ్మలు, కప్‌బోర్డులు, పుస్తకాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. తరచూ వ్యాయామం, యోగా, ధ్యానం చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.