విశాఖలో మరో దారుణం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగినితో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెకు మత్తుమందిచ్చి, స్పృహలో లేని సమయంలో ఆమె అభ్యంతరకర చిత్రాలు తీశాడు. వాటిని అంతర్జాలంలో పెడతానని బెదిరించి డబ్బులు వసూలు చేయడమే కాకుండా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
అందినచోటల్లా అప్పులు చేసి ఆమె ఆ మృగాడికి రూ.50 లక్షలకు పైగా ఇచ్చింది. ఇవ్వడానికి ఇక తన దగ్గర డబ్బులు కూడా లేవని, అప్పుల్లో కూరుకుపోతున్నానని.. వదిలిపెట్టమని చెప్పండని అతని తల్లిదండ్రుల కాళ్లావేళ్లా పడింది. వాళ్లిద్దరూ కొడుకు అకృత్యాలకు అడ్డుచెప్పకపోగా .. అతణ్ని మరింత ప్రోత్సహించారు. ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు తెచ్చినప్పుడల్లా అతని అమ్మానాన్నలు కూడా ఆ మొత్తాన్ని పంచుకునేవారని తెలిసి పోలీసులే విస్తుపోతున్నారు.