కరోనా కారణంగా గ్రామాల్లోకి అంబులెన్సులను సైతం రానివ్వటం లేదు. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం పాలమామిడిలో పాంగి లలిత అనే నిండు గర్భిణి.. పురిటి నొప్పులతో బాధ పడుతుండగా ఆమె కుటుంబీకులు అంబులెన్సును సంప్రదించారు. అంబులెన్సు రాగానే గ్రామస్థులు అడ్డుకున్నారు. సచివాలయ సిబ్బందికి తప్ప ఎవ్వరికి ప్రవేశం లేదని బోర్డు పెట్టారు.
గ్రామంలోకి వచ్చిన వైద్య సిబ్బందిని సైతం వెనక్కి పంపించారు. అంబులెన్సును గ్రామానికి కొంచెం దూరంలో ఉంచి.. గర్భిణిని నడిపించుకుంటూ అక్కడి వరకు తీసుకెళ్లారు. అంబులెన్సు ఎక్కిన కాసేపటికి.. మహిళకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఆస్పత్రికి ప్రయాణిస్తుండగా మార్గమధ్యలోనే మహిళ ప్రసవించింది. జి.మాడుగుల ఆస్పత్రికి తరలించగా.. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.