శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినైన విజయలక్ష్మి విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో పీజీ పట్టా సాధించారు. భర్త శ్రీనివాసరావు విశాఖలో అకౌంటెంట్‌గా పనిచేస్తుండటంతో నగరంలోనే స్థిరపడ్డారు. ఇక్కడే ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేసేవారు. కరోనా సమయంలో.. ఆమె ఉద్యోగం పోవడంతో ఇంటివద్దే ఉన్నారు. ఆ సమయంలోనే భర్త శ్రీనివాసరావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్మును.. భర్త ఆరోగ్యం కోసం వినియోగించడంతో తిరిగి ఆమె ఉపాధి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది.
ప్లాస్టిక్ భూతం వల్ల భర్తకు ఎదురైన అనారోగ్యం ఆమెను మానసికంగా వెంటాడుతూనే ఉంది. ఆ సమయంలోనే ప్లాస్టిక్‌ను నివారించే ఉత్పత్తులను తను ఉపాధి మార్గంగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ నేరుగా తినేందుకు అవకాశం కలిగిన టీ కప్పులు తయారీ మెషీన్లను విక్రయిస్తోంది అని తెలుసుకున్నారు. తన వద్ద ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని, కెనరా బ్యాంకు రుణంతో జోడిస్తూ ఎడిబుల్ టీ కప్స్ యంత్రాలను కొనుగోలు చేసి.. విశాఖలో శ్రీహర్ష ఎంటర్ప్రైజెస్ పేరిట పరిశ్రమను స్థాపించారు.