పెందుర్తి ఠాణా పరిధిలో దారుణం జరిగింది. వివాదం కారణంగా మనస్థాపానికి గురైన ఓ మహిళ తన కూతురిని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసుల... దర్యాప్తులో వెలుగుచూసిన విషయాలతో నిర్ఘాంతపోయారు.
'నా బిడ్డను గొయ్యి తీసి పూడ్చిపెట్టాను' - woman missing news in pendurthi
సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని క్షణికావేశం కాటేసింది. ఇంట్లో నెలకొన్న వివాదం కారణంగా చంటిబిడ్డతో ఇల్లు వదిలి వెళ్లిన ఓ వివాహిత 4 రోజుల తర్వాత దీనావస్థలో కనపడింది. బిడ్డ మరణించిందని, గొయ్యి తీసి పూడ్చిపెట్టానని ఆమె చెప్పడం కలకలం రేపింది. మహిళ మానసిక స్థితి తెలుసుకునేందుకు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు ఏసీపీ స్వరూప వెల్లడించారు.
స్థానిక ఏసీపీ స్వరూప తెలిపిన వివరాల ప్రకారం... పులగానిపాలెం గ్రామానికి చెందిన కె.సుమలత ఆమెతో పాటు తన 18నెలల పాప కనపడటంలేదని ఈనెల 6న పెందుర్తి పోలీస్స్టేషన్లో ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా... చిన్న ముషిడివాడ కాలనీ కొండలమీద నుంచి దిగుతూ ఒక మహిళ కనిపించినట్లు సమాచారం వచ్చింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని సుమలతగా గుర్తించారు.
ఆమెను విచారించగా తన కూతురు చనిపోయిందని... కొండ ప్రాంతంలో గొయ్యి తీసి పూడ్చిపెట్టినట్లు తెలిపింది. కొండపైన గాలింపు చేపట్టగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. డాగ్ స్క్వాడ్ సాయంతో గాలిస్తున్నట్టు ఏసీపీ స్వరూప తెలిపారు. సుమలత మానసిక పరిస్థితిపై అనుమానంతో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్టు ఏసీపీ చెప్పారు.