విజయనగరం జిల్లాకు చెందిన ఓమహిళకు ఇటివల కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెకు విశాఖ విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. నిబంధనల ప్రకారం ఆమె ఏ ఊరిలో చనిపోతే ఆ ఊరిలోనే అంతిమ సంస్కారం చేయాల్సి ఉంది. ఈమె క్రైస్తవ మతానికి చెందినందువల్ల ఈమె మృతదేహాన్ని కరాసలోని క్రిస్టియన్, హిందూ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు.
కరోనా నిబంధనల ప్రకారం జీవీఎంసీ సిబ్బంది పాతిపెట్టారు. అయితే ఇంతలో దగ్గరలోని స్థానిక ప్రజలకు విషయం తెలిసింది. కొవిడ్ దుస్తుల్లో ఉన్న జీవీఎంసీ సిబ్బందిని చూసి ఆందోళన చేపట్టారు. కరోనాతో మృతిచెందిన ఈమె మృతదేహాన్ని ఇక్కడ పాతిపెట్టడానికి వీల్లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శాస్త్రి ఘటనాస్థలానికి చేరుకొని స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.