Woman Suicide: విశాఖ జిల్లాలోని ముదపాక పంచాయతీ గోవిందపురం గ్రామానికి చెందిన సారిపల్లి భీమేశ్వరరావు, సోమేశ్వరరావు, కడియాల అచ్చియ్యమ్మ తోబుట్టువులు. సోదరులిద్దరూ గ్రామంలోని రెండు సెంట్ల స్థలాన్ని అచ్చియ్యమ్మకు బహుమానంగా ఇచ్చారు. కొన్నాళ్లుగా ఆ స్థలానికి సంబంధించి వీరికి.. స్థానిక వైకాపా నాయకుల మధ్య వివాదం నడుస్తోంది. వైకాపా నాయకుల వేధింపులు భరించలేక సోమేశ్వరరావు పురుగుల మందు తాగి ఈ ఏడాది సెప్టెంబరు 9న చనిపోయారు. అచ్చియ్యమ్మకు చెందిన రెండు సెంట్లను వుడా లేఅవుట్లో ఖాళీ స్థలంగా గుర్తించామని, 15 రోజుల్లో దాన్ని ఖాళీ చేయాలని ముదపాక పంచాయతీ కార్యదర్శి కె.నాగప్రభు ఈ నెల 2 నోటీసులు జారీ చేశారు.
అప్పటి నుంచి అచ్చియ్యమ్మ తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పలుచోట్ల వెదికారు. వారి నివాసానికి సమీపంలోని వ్యవసాయ బావిలో ఆమె మృత దేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పెందుర్తి సీఐ గొలగాని అప్పారావు, ఎస్‌ఐ రాంబాబు, సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంటకు గోవిందపురం చేరుకున్నారు. బావిలో నీరు అధికంగా ఉండటంతో మోటార్లతో తోడించారు. మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో అచ్చియ్యమ్మ మృతదేహాన్ని బయటకు తీయించారు.
అచ్చియ్యమ్మ మృతదేహాన్ని రోడ్డుపైకి తీసుకొస్తుండగా భర్త చిన్నారావు, సోదరుడు భీమేశ్వరరావు చూసేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు పక్కకు లాగేసి మృతదేహాన్ని అంబులెన్సులో పెట్టేశారు. దీంతో వారు అంబులెన్సు ఎదుట బైఠాయించారు. గ్రామస్థులు వాహనాన్ని చుట్టుముట్టడంతో పోలీసులు వారిని లాఠీలతో చెదరగొట్టారు. మృతదేహం ఉన్న అంబులెన్సును గ్రామస్థులు మళ్లీ అడ్డుకుంటారనే ఉద్దేశంతో డ్రైవర్ వేగంగా ముందుకు నడిపించారు. ఈ క్రమంలో గ్రామస్థులను చెదరగొడుతున్న ఎస్‌ఐ రాంబాబు కాలి పైనుంచి అంబులెన్సు వెళ్లిపోయింది. ఆయన కాలు వెనక్కు మెలి తిరిగి విరిగిపోయింది.
ముదపాక గ్రామంలో ల్యాండ్ పూలింగ్ అక్రమాలకు అడ్డు పడుతున్నారని సోమేశ్వరరావు, భీమేశ్వరరావు కుటుంబంపై వైకాపా నాయకులు కక్ష కట్టారని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. అచ్చియ్యమ్మ మృతిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా, రసీదు ఇవ్వకుండా పోలీసులు జాప్యం చేయడంతో పెందుర్తి స్టేషన్‌కు చేరుకుని బండారు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులను నిలదీయడంతో ఎట్టకేలకు రసీదు ఇచ్చారు. అచ్చియ్యమ్మ మృతికి కారకులపై కేసులు నమోదు చేసే వరకు పోస్టుమార్టానికి అంగీకరించేది లేదని ఆయన స్పష్టంచేశారు.