అడపా దడపా కురుస్తున్న వర్షాలకు విశాఖ జిల్లాలోని జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. జిల్లాలోని మాడుగుల నియోజకవర్గంలో రైవాడ, పెద్దేరు, కోనాం జలాశయాల నీటిమట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. అప్రమత్తమైన అధికారులు కొద్దిరోజులుగా ఆయా జలాశయాల నుంచి శారద, పెద్దేరు, బొడ్డేరు నదుల్లోకి అదనపు నీటిని విడుదల చేస్తున్నారు.
మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నుంచి గేట్లు ఎత్తి దిగువకు పెద్దేరు నదిలోకి 403 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నుంచి ఒక గేటు ఎత్తి 375 క్యూసెక్కుల నీటిని శారదా నదిలోకి నీటిని వదులుతున్నారు. కోనాం జలాశయం నుంచి 250 క్యూసెక్కుల వరద నీటిని బొడ్డేరు నదిలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు ఆయకట్టులోని పొలాలకు రైవాడ, పెద్దేరు, కోనాం జలాశయాల నుంచి సాగునీటిని విడుదల చేస్తున్నారు.