ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డొంకరాయి జలాశయం నుంచి గోదావరి డెల్టాకు నీటి విడుదల - water release from donkarai project

రబీ పంటల కోసం డొంకరాయి జలాశయం స్పిల్‌వే నుంచి గోదావరి డెల్టాకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం తగ్గడంతో జ‌ల‌వ‌న‌రుల‌ శాఖ విన్నపం మేర‌కు సీలేరు కాంప్లెక్స్ నుంచి కూడా నీటి విడుద‌ల‌ను పెంచారు.

water release from donkarai project
డొంక‌రాయి జ‌లాశ‌యం నుంచి నీటి విడుదల

By

Published : Mar 21, 2021, 3:26 PM IST

ఉభయ గోదావరి జిల్లాల్లోని రబీ పంటల కోసం డొంకరాయి జలాశయం నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. రోజుకు 7వేల 500 క్యూసెక్కుల చొప్పున అధికారులు నీరు వదులుతున్నారు. ప్రస్తుతం రబీ సీజన్ చివరి దశకు వచ్చిన తరుణంలో ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోవడంతో రైతులు సీలేరుపై ఆధారపడ్డారు. జ‌ల‌వ‌న‌రుల‌ శాఖ విన్నపం మేర‌కు సీలేరు కాంప్లెక్స్ నుంచి నీటి విడుద‌ల‌ను పెంచారు.

పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం విడుదలయ్యే 4వేల 300 క్యూసెక్కులు నీరు సరిపడకపోవడంతో అదనంగా డొంక‌రాయి జ‌లాశ‌యం స్పిల్‌వే ద్వారా 3వేల 200 క్యూసెక్కులు నీరును విడుద‌ల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి అనంతరం విడుదలయ్యే నీటితో కలసి 7,500 క్యూసెక్కుల నీరు గోదావరి డెల్టాకు విడుదల అవుతుంది.

ప్రస్తుతం బలిమెలలో ఆంధ్రా వాటాగా 20.7 టీఎంసీలు, గుంటవాడ, డొంకరాయిల్లో నిల్వ ఉన్న 10.63 టీఎంసీలతో కలిపి 31.33 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం గోదావరి డెల్టా అవసరాల కోసం బ‌లిమెల జ‌లాశ‌యం నుంచి 6వేల క్యూసెక్కులు నీటిని వాడుకుని డొంక‌రాయి జ‌లాశ‌యం ద్వారా ర‌బీ పంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నారు. ఇప్పటివరకు ‌డొంకరాయి ప్రాజెక్టు ద్వారా 13 టీఎంసీల నీటిని విద్యుదుత్పత్తి లేకుండా నేరుగా గోదావరి డెల్టాకు విడుదల చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ధ‌వ‌ళేశ్వరం బ్యారేజీలో సీలేరు నుంచి వ‌స్తున్న నీటి నిల్వల‌తో 8 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. వచ్చే నెల మొదటి వారం వరకు ఈ ప్రవాహాలు ఇలాగే కొనసాగితే.. డెల్టాలో రబీ పంటలకు ఎలాంటి ఇ్బబంది ఉండదని అధికారులు వివరించారు.

ఇదీ చూడండి:

'టీకా చక్కగా పని చేస్తోంది.. ప్రజలు కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details