ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనాంలో సమృద్ధిగా నీరు.. ఖరీఫ్ సాగుకు లేదిక బెంగ..! - విశాఖ జిల్లా కోనాం జలాశయం వార్తలు

ఇటీవల కురిసిన వర్షాలతో...విశాఖ జిల్లాలోని కోనాం జలాశయం నిండు కుండను తలపిస్తోంది. జలాశయంలో నీరు సమృద్ధిగా ఉంది. ఖరీఫ్ పంటలకు అవసరమైన సాగునీటికి ఇక బెంగ ఉండదని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జలాశయం ఆయకట్టు పరిధిలో వరినాట్లు వేసేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. ఆగస్టు మొదటి వారంలో సాగునీరు విడుదల చేయాలని జలాశయం సాగునీటి కమిటీ పాలకవర్గం... అధికారులను కోరింది.

కోనాంలో సమృద్ధిగా నీరు.. ఖరీఫ్ సాగుకు లేదిక బెంగ..!
కోనాంలో సమృద్ధిగా నీరు.. ఖరీఫ్ సాగుకు లేదిక బెంగ..!

By

Published : Jul 20, 2020, 11:09 AM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయం నీటిమట్టం పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయంలోకి 184 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, ప్రస్తుతం 97.80 మీటర్లు నీటి మట్టం ఉందని జలవనరులశాఖ అధికారులు తెలిపారు.

కోనాం జలాశయం ఆయకట్టులో వరిసాగుచేస్తుంటారు. ప్రస్తుతం నారుమళ్లు వేశారు. ఈ నేపథ్యంలో జలాశయం సాగునీటి కమిటీ పాలకవర్గం సమావేశం ఏర్పాటుచేశారు. ఆగస్టు మొదటి వారంలో ఖరీఫ్ వరినాట్లకు నీరు విడుదల చేయాలని తీర్మానం చేసింది. దీంతో రైతులు వరినాట్లకు సన్నద్ధమవుతున్నారు. జలాశయం నుంచి చీడికాడతోపాటు మాడుగుల, బుచ్చయ్యపేట, చోడవరం, దేవరాపల్లి మండలాలకు చెందిన గ్రామాలకు సాగునీరు అందుతుంది. జలాశయం పరిధిలో 14,450 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది జలాశయంలో ఖరీఫ్ పంటలకు అవసరమైన నీటి నిల్వలు ఉన్నాయని జలాశయం సాగునీటి కమిటీ ఛైర్మన్ గండి ముసలినాయుడు తెలిపారు. జలవనరుల శాఖ అధికారులు స్పందించి ఆగస్టు మొదటి వారంలో సాగునీటిని విడుదల చేయాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి :కొవిడ్‌ ఆసుపత్రుల్లో సేవల కోసం 333 మంది వాలంటీర్ల ఎంపిక

ABOUT THE AUTHOR

...view details