విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన శాసనసభ్యులు ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేసి జలాశయం పరిస్థితిని వివరించారు. ప్రధానంగా ఈ రెండు జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు చెందిన భూములు సాగుకు సరిపడ నీరు లేదని సీఎంకు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. తాండవ జలాశయం నీటిమట్టం పుష్కలంగా ఉన్నప్పటికీ మెట్ట ప్రాంతాల వరకు నీరు చేరకపోవటంతో.. ఏలేరు కాలువ నుంచి విశాఖ ఉక్కు కర్మాగారానికి నీటిని అందిస్తున్నారు. ఏలేరు కాలువను ఈ జలాశయానికి అనుసంధానం చేస్తే మరిన్ని మెట్ట ప్రాంత భూములు సాగులోకి వస్తాయని ముఖ్యమంత్రికి విన్నవించారు. దీంతో ఈ ఏడాది తాండవ జలాశయాన్ని ఏలేరు కాలువకు అనుసంధానం చేయాలని ప్రభుత్వ ప్రతిపాదించింది.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముందుగానే ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 77 గ్రామాల్లో సుమారు 52 వేల ఎకరాలు ఈ జలాశయం కింద సాగులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ మొత్తం ఆయకట్టుకు ఏకధాటిగా విడుదల చేస్తే వంద రోజులకు సరిపోతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో సెప్టెంబర్ నాటికి పంట దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. తద్వారా భారీ వర్షాలు, తుపాను వంటి విపత్తుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు.