సరకు రవాణాలో వాల్తేర్ డివిజన్ వ్యూహం మంచి ఫలితాలను ఇస్తోంది. నిర్ణీత కాల పట్టికతో నిర్దిష్ట సమయాల్లో రైల్వే పార్శిల్ సేవలు కొవిడ్ సమయంలో ప్రజలను ఆకట్టుకుంటోంది. నిత్యావసరాలు, అత్యవసర సామగ్రి అయిన మందులు, ఇతర ముఖ్యమైన పార్శిళ్లను గమ్యస్థానాలకు చేరవేయటంలో ఈ డివిజన్ అద్వితీయ పాత్ర పోషించింది. ఈ క్రమంలో 502 ట్రిప్‌లను నడిపింది. బెడ్ షీట్లు, మెడికల్ పరికరాలు, మామిడి పండ్లు, అటోమొబైల్తో పాటు ఆహార పదార్థాలనూ రవాణా చేసింది. ఏప్రిల్ 9 నుంచి సెప్టెంబర్ 18 వరకు 5,829 టన్నుల సరకులను 56,437 పార్శిళ్ల రూపంలో దేశంలో వివిధ ప్రాంతాలకు చేరవేసింది.
వ్యాపారులకు అండగా
చిన్న, సన్నకారు వ్యాపార యూనిట్లకు సదుపాయంగా ఉండే విధంగా వాల్తేర్ డివిజన్ బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రైల్వే సేవలను వారికి ఉపయుక్తంగా అందుబాటులోకి తీసుకువచ్చి, వారి వ్యాపార కార్యకలాపాలకు అండగా ఉండాలన్నది ఉద్దేశంగా పెట్టుకుంది. కార్గో రవాణా పెంచుకోవడం ద్వారా ఈ వర్గాలకు అండగా ఉండడం కోసం వారి అవసరాల మేరకు మార్పులు-చేర్పులు కూడా చేస్తోంది.
విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు-హౌరా పార్శిల్ స్పెషల్ సర్వీసు ద్వారా 28.5 టన్నుల బుకింగ్ గత కొద్ది వారాల్లో చేయగలిగింది. ఈ సదుపాయం వల్ల వ్యాపారులకు, కార్గో పంపేవారికి, రైతులకు, చిన్న మొత్తాలలో సరకులు పంపాలనుకునేవారికి ఉపయోగపడింది. నిర్ణీత షెడ్యూల్ ద్వారా సరకులను గమ్య స్ధానాలకు చేర్చడం వల్ల మరింత నమ్మకాన్ని సమకూర్చుకోగలిగింది.