విశాఖ శివారు వడ్లపూడిలో భారతీయరైల్వే తెచ్చిన ‘వ్యాగన్ పీరియాడిక్ ఓవర్‌హాల్ (పీవోహెచ్) వర్క్‌షాప్’ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది. 2019 నవంబరుకే పనులు పూర్తికావాల్సి ఉండగా సాంకేతక ఇబ్బందులు, కొవిడ్ కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. సుమారు రూ.260కోట్లతో రైల్వేఅనుబంధ సంస్థ ఆర్‌వీఎన్‌ఎల్ ఈ ప్రాజెక్టు నిర్మాణాల్ని పూర్తిచేసి ఈనెల 12న రైల్వేఅధికారులకు అప్పగించారు. అవసరమైన అధునాతన యంత్రాలు, సాంకేతికత సిద్ధంచేసి ఉంచారు. ప్రస్తుతం ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నారు. వర్క్‌షాప్‌కు కేటాయించిన గూడ్స్‌వ్యాగన్లను కొంతమంది సిబ్బందితో పూర్తిస్థాయిలో ఓవర్‌హాలింగ్ చేస్తున్నారు.
2వేలమంది కార్మికులు
నెలకు 200 వ్యాగన్లను పూర్తిస్థాయిలో ఇక్కడ ఓవర్‌హాలింగ్ చేయనున్నారు. చుట్టుపక్కల రైల్వేడివిజన్ల నుంచి వ్యాగన్లు వచ్చే అవకాశముంది. శాశ్వత, తాత్కాలిక కార్మికులంతా కలిసి సుమారు 2వేలమందిదాకా వర్క్‌షాప్‌లో పనిచేసేందుకు అవసరమని రైల్వే అధికారుల అంచనాలు. ప్రస్తుతం ఓ ఏజెన్సీ సాయంతో కొంతమంది సిబ్బందిని తీసుకుని ప్రారంభోత్సవానికి వెళ్లాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తంతు పూర్తయ్యేందుకు మరో 5, 6మాసాల సమయం పడుతుందని భావిస్తున్నారు. పైస్థాయి, కిందిస్థాయి అధికారులందరికీ 64క్వార్టర్లని, పరిపాలనా భవానాన్ని, క్యాంటీన్‌ను సిద్ధంచేసి ఉంచారు.
- బడ్జెట్ ప్రకటన - 2014-15
- నిధుల మంజూరు - 2015-16
- ప్రాజెక్టు వ్యయం - రూ.260కోట్లు
- విస్తీర్ణం - 200ఎకరాలు
- నిర్వాహణ సామర్థ్యం - నెలకు 200 వ్యాగన్లు