కరోనా వ్యాధి నిర్ధారణ సర్వే చేస్తూ.. అకస్మాత్తుగా అస్వస్థతకు గురై విశాఖ మన్యంలో ఓ గ్రామ వాలంటీర్ మృతిచెందాడు. విశాఖ జిల్లా జి. కె. వీధి మండలం దారకొండ గ్రామంలో వాలంటీర్ చుంచు దారమల్లేశ్వరారావు.. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా 12వ విడత ఫీవర్ సర్వే చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానిక హెల్త్ సబ్ సెంటర్లో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం చింతపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మల్లేశ్వరరావు మృతిచెందాడు.
కుటుంబ సభ్యులు పిపీఈ కిట్లు ధరించి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. మృతుడికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. మృతుడిని ఫ్రంట్‌లైన్ వారియర్‌గా గుర్తించి తక్షణమే అతని కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని, అతని భార్యకు ఆ వాలంటరీ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర గ్రామ వలంటీర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాంబాబు, కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు.