ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారి చూపిన గిరి స్ఫూర్తి..

స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా విశాఖ మన్యంలో చాలా గ్రామాలకు రహదారులే లేవు. మండల కేంద్రానికి చేరాలన్నా 50 కిలోమీటర్లు దూరం నడక సాగించాల్సిందే. లేకుంటే గుర్రాలను ఆశ్రయించాలి. అత్యవసర పరిస్థితులు ఎదురైతే డోలీ మోతలే గతి. సకాలంలో వైద్యం అందక మార్గమధ్యంలోనే ప్రాణాలు పోయిన సందర్భాలెన్నో ఉన్నాయి. అందుకే ఆ గిరిజనులు తమ శ్రమనే నమ్ముకుని స్వచ్ఛందంగా రోడ్లు వేసుకున్నారు.

vizag tribals constructed roads their own
విశాఖ మన్యం గిరిజనులు

By

Published : Jun 11, 2020, 1:01 PM IST

మన్యంలో మౌలిక సదుపాయాల కోసమని వందల రూ.కోట్లు ఖర్చుచేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటనలే తప్ప క్షేత్రస్థాయిలో ఆ ఫలాలు కనిపించడం లేదు. ఇన్నాళ్లు.. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురుచూసిన గిరిజనానికి నిరాశే మిగిలింది. ఇకపై ఎవరిపైనా ఆధారపడకూడదని తమ గ్రామాలను తామే బాగుచేసుకోవాలని సంకల్పించారు. చేయి చేయి కలిపి శ్రమదానంతో రహదారుల నిర్మాణానికి నడుంబిగించారు. పదుల గ్రామాలను అనుసంధానిస్తూ 15 కిలోమీటర్ల మేర గిరిజనులే రహదారులను నిర్మించుకుని ఔరా అనిపించారు. మరింత మందిలో స్ఫూర్తి నింపారు.

విశాఖ జిల్లా అరకులోయ నియోజకవర్గంలోని అనంతగిరి మండలం పినకోట, పెదకోట, కివర్ల, గుమ్మ పంచాయతీల్లో చాలా గ్రామాలకు రహదారి సదుపాయం లేదు. లాక్‌డౌన్‌కు ముందుగానే పెదకోట పంచాయతీ పరిధిలో చటాకంభ నుంచి బోనురు, జగడాలమామిడి గ్రామాల మధ్య 200 మంది గిరిజనులు రోడ్డు పనులు మొదలుపెట్టారు. సుమారు 14 కిలోమీటర్ల పైగా కొండల అంచున బండలను తొలగించి గుట్టలను చదును చేసి వాహనాలు తిరగడానికి అనువుగా బాగుచేసుకున్నారు. వీరి శ్రమను గుర్తించిన అధికారులు ఉపాధి పథకంలో గిరిజనులు చేపట్టిన పనికి మస్తర్లు వేసి రూ.11 లక్షలు మంజూరు చేశారు. కొంతమేర బిల్లులు చేశారు. అంతేకాకుండా ఆ గ్రామాల మీదుగా 22 కిలోమీటర్ల మేర బిటీ రోడ్డు నిర్మాణానికి రూ.17 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

స్ఫూర్తిని అందుకున్నారిలా..

*● పక్క గ్రామాల వారిని ఆదర్శంగా తీసుకుని మడ్రాబు గ్రామం నుంచి దాయర్తి వరకు స్థానికులే రహదారి నిర్మాణానికి ముందుకొచ్చారు. 3 గ్రామాల నుంచి సుమారు 300 మంది గిరిజనులు శ్రమదానంతో 3 కిలోమీటర్ల మేర గ్రావెల్‌ రహదారిని నిర్మించుకున్నారు.

*● లుంగపర్తి పంచాయతీ పరిధిలోని ఒనుకొండ గ్రామానికి చేరుకోవాలంటే గోస్తనీ నదిని దాటి 10 కిలోమీటర్లకుపైగా కాలినడకన వెళ్లాలి. శ్రమదానంతో రోడ్డు నిర్మించుకునేందుకు స్థానికులు నడుంబిగించారు. 2 వారాలుగా పనులు చేస్తూ 2 కిలోమీటర్ల మేర రహదారిని ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా తవ్వారు.

ఇలా ఒక గ్రామాన్ని చూసి మరొక గ్రామం ముందుకు వచ్చి రహదారులను నిర్మించుకోవడం మంచి పరిణామమేనని.. ఇలాంటి పల్లెలకు ఉపాధిహామీ నుంచి తగిన సహకారం అందిస్తామని డ్వామా పీడీ సందీప్‌ చెబుతున్నారు.

గుమ్మ పంచాయతీ పరిధిలోని దిగువ మల్లెలు, ఎగువ మల్లెలు, మర్రిబంద, కడరేవు, ఎర్రగొప్పు, కౌంటిగుడ, నెల్లిపాడు, బొడిగురు గ్రామాలకు చెందిన వారంతా స్వచ్ఛందంగా తమ గ్రామాలను అనుసంధానించేలా కొత్తమార్గాన్ని నిర్మించుకుంటున్నారు. సుమారు 10 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపడుతున్నారు.

ఇవీ చదవండి....

తెనాలిలో 47 ఏళ్ల మహిళకు కవలలు..

ABOUT THE AUTHOR

...view details