ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Vizag Steel Plant జగనన్న.. విశాఖ ఉక్కుకోసం ఓ బటన్ నొక్కండి! కార్మిక సంఘాల వేడుకోలు..! - AP Latest News

Vizag Steel Plant: జగనన్న ఇళ్లు.. నాడు-నేడు పనులు, పునరావాస కాలనీల నిర్మాణాలకు విశాఖ ఉక్కు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక టన్ను అయినా కొనుగోలు చేసిందా? పోలవరం ప్రాజెక్టు, పునరావాసం పనులకు గానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీలు ఎంతవాడారో లెక్క చెప్పగలరా? అంటే సమాధానం లేదు. వివిధ రకాల పథకాలకు బటన్లు నొక్కుతున్న ముఖ్యమంత్రి జగన్‌ ఉక్కు కర్మాగారం కోసం ఒక్క బటన్‌ నొక్కలేకపోతున్నారా? అన్న కార్మిక సంఘాల ప్రశ్నకు బదులు లేదు. విశాఖ ప్రతిష్ఠకు కారణమైన ఉక్కు కర్మాగారాన్ని ఆదుకుందామన్న సంకల్పం అసలే లేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనూ విశాఖ ఉక్కుపై కేంద్రాన్ని నిలదీయాలన్న ఆలోచన కూడా వైసీపీ ఎంపీలకు ఉన్నట్లు కనిపించడం లేదు.

Vizag Steel Plant
జగన్ సారూ.. విశాఖ ఉక్కుకి కూడా ఓ బటన్ నోక్కి చేయూత ఇవ్వొచ్చుగా..!

By

Published : Jul 28, 2023, 12:48 PM IST

Updated : Jul 28, 2023, 1:05 PM IST

Vizag Steel Plant: విశాఖ ఉక్కు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో మోయాల్సిన అవసరం లేదని, కొంత చేయూతనిస్తే చాలని కార్మిక, ఉద్యోగ సంఘాల మొరపెట్టుకుంటున్నాయి.విశాఖ ఉక్కుకు రాష్ట్ర ప్రభుత్వం ఊరికే ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం లేదని, అడ్వాన్స్‌గా కొంత మొత్తం ఇచ్చి ఉక్కు కొంటే చాలని కార్మికులు కోరుతున్నారు. ముడి సరకు సమకూరక ఉత్పత్తి ధర పెరిగిపోయి విశాఖ స్టీలు ప్రస్తుతం మార్కెట్‌లో నష్టాలకు అమ్మాల్సి వస్తోందని.. అదే ఉక్కును ఉత్పత్తి ధరకే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఎవరైనా కాదంటారా? అని వారు ప్రశ్నిస్తున్నారు.

అవకాశం ఉన్నా.. రాష్ట్రంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రస్తుతం.. వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కో లబ్ధిదారుకు 400 కేజీలకు పైగా స్టీలు అవసరమవుతోంది. సుమారు 7 వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన స్టీలు వినియోగిస్తున్నారు. ఉత్పత్తి ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్​ఐఎన్​ఎల్​ నుంచి కొనుగోలు చేసి అడ్వాన్సుగా 3 వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటే.. రాష్ట్ర అవసరాలు తీరడంతో పాటు, ప్లాంటు నిలదొక్కుకునేది. తితిదే ఆధ్వర్యంలో పలు నిర్మాణాలు జరుగుతుంటాయి. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చొరవ తీసుకుని వీటికి అయినా విశాఖ ఉక్కు వినియోగించేలా నిబంధన విధిస్తే కర్మాగారానికి దన్నుగా నిలిచే అవకాశం ఉంటుందని కార్మిక సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

విజ్ఞప్తులపై కంటితుడుపు చర్యలు.. విశాఖ స్టీల్‌ ప్లాంటు నుంచి ఉక్కు కొనుగోలు చేసి ఆర్థిక చేయూతనివ్వాలంటూ కార్మిక, ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వం ఈ విషయంలో కంటితుడుపు చర్యలు చేపడుతోంది. సీఎంవో నుంచి పరిశ్రమల మంత్రిత్వ శాఖకు, అక్కడి నుంచి కమిషనరేట్‌కు లేఖలు పంపి.. చివరకు జిల్లా పరిశ్రమల శాఖ అధికారులకు ఆదేశాలిచ్చి సాధ్యాసాధ్యాల పరిశీలన బాధ్యత అప్పగించడం హాస్యాస్పదంగా మారింది. రాష్ట్రస్థాయిలో గృహ నిర్మాణశాఖ, పరిశ్రమల శాఖల అదనపు కార్యదర్శులు, లేదా సీఎంవో నుంచి సంప్రదింపులకు పిలిస్తే.. ఆర్​ఐఎన్​ఎల్ ప్లాంటు అధికారులు అమరావతికే వెళ్లి చర్చించి ఒప్పందాలు చేసుకునే అవకాశమున్నాఈ దిశగా చర్యలు చేపట్టడం లేదు.

జీఎస్టీ వాటాను మాఫీ చేసేలా కేంద్రానికి లేఖ రాయొచ్చుగా.. ఏటా ఆర్​ఐఎన్​ఎల్ ప్లాంటు చెల్లిస్తున్న జీఎస్టీ 9శాతం రాష్ట్రానికే వస్తుంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు 4వేల 600 కోట్ల రూపాయల మేరకు స్టీలు ప్లాంటు నిధులు జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి జమయ్యాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర జీఎస్టీకి సంబంధించి వాటా మొత్తాన్ని విశాఖ స్టీలుకు ఇచ్చేయవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో గ్యాస్‌ రాయితీలను అక్కడి ప్రభుత్వాలు భరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కుపై వచ్చిన జీఎస్టీ వాటాను మాఫీ చేసేలా కేంద్రానికి లేఖ రాయొచ్చుగా.? అన్నది కార్మిక సంఘాల ప్రశ్న. ఉద్యోగులకు జీతాలివ్వలేక, గంగవరం అదానీ పోర్టు నుంచి బొగ్గు విడుదల చేసుకోలేక ప్లాంటు మనుగడ.. ఆయోమయంలో పడిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో రాష్ట్రం జోక్యం చేసుకుని ఆర్థికంగా ఆదుకునే అడుగులు వేస్తే.. విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం చేకూరుతుందని కార్మికులు కోరుకుంటున్నారు.

జగనన్న.. విశాఖ ఉక్కుకోసం ఓ బటన్ నోక్కండి!
Last Updated : Jul 28, 2023, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details