కరోనా ప్రభావం విశాఖ పోర్టుపై ఈ 6 నెలలుగా ఎలా ఉందన్న అంశాలపై పోర్ట్ ఛైర్మన్ కే. రామ్మోహన్ రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ప్రశ్న: ఈ 6 నెలల కాలంలో మీరు ఏ రకమైన సమస్యలు ఎదుర్కొన్నారు? వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు?
జవాబు: గతేడాది ఇదే సమయంలో 21 మిలియన్ టన్నుల సరకులను హ్యాండిల్ చేస్తే ఈసారి 19 మిలియన్ టన్నులు మాత్రమే చేయగలిగాం. స్టీమ్ కోల్, కుకింగ్ కోల్ తగ్గింది. ఆయిల్ కూడా తగ్గింది. గత సంవత్సరంతో పోలిస్తే ఐరన్ ఓర్ బాగా ఎక్కువగా చేశాం. మొత్తం మీద దాదాపు 6 శాతం వరకు తగ్గుదల కనిపించింది. ఐరన్ ఓర్లో 10 శాతం పెరుగుదల ఉంది. మిగిలిన పోర్టులలో 15 నుంచి 22 శాతం వరకు తగ్గుదల కనిపించింది. వారితో పోలిస్తే మనం కొంత మెరుగ్గానే ఉన్నాము. ఈ పరిస్థితి నుంచి రానున్న నెలల్లో బయట పడతామని ఆశిస్తున్నాం.
ప్రశ్న: ప్రధానంగా ఏయే దేశాల నుంచి మనకు దిగుమతులు, ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి?
జవాబు: విద్యుత్ కేంద్రాలన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేయడంలేదు. స్టీమ్ కోల్కి డిమాండ్ తగ్గింది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి మనకు టీం కాల్ వస్తుంది. ఐరన్ ఓర్ మనకు పెరిగింది. చైనా, జపాన్, కొరియా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కంటెయినర్లలో ఎక్స్పోర్ట్ పెరిగింది.
ప్రశ్న: కొత్త కార్గో ఎంతవరకు మనకు అందుబాటులోకి వస్తోంది?
జవాబు: కొత్త కార్గోలో స్టీం కోల్ ఒకటి. మనం గతంలో దిగుమతి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు దేశంలో ఉన్న బొగ్గు నిల్వలను స్టీమ్ కోల్‌ను దేశీయ అవసరాలతో పాటు ఎగుమతికి అవకాశం ఇచ్చారు. పంచదార ఎగుమతికి చూస్తున్నాం. ఆహార దినుసులు, బియ్యం ఎగుమతికి అవకాశం ఉంది. గ్రానైట్ బ్లాక్స్, ఫ్లై యాష్ ఎగుమతికి ఎన్టీపీసీ ప్రయత్నిస్తోంది.