విశాఖపట్నం పోర్టు 2019-20 ఆర్ధిక సంవత్సరంలో 72.72 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసి సరికొత్త ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 11.15 శాతం వృద్ది రేటుతో ఈ రికార్డును సృష్టించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 65.30 మిలియన్ టన్నుల కార్గోని హ్యాండిల్ చేసిన విశాఖ పోర్టు ఈ ఏడాది 7.42 మిలియన్ టన్నుల కార్గోని దానికి జత చేయగలిగింది. దేశంలో కాండ్లా, పారదీప్ పోర్టుల తర్వాత స్థానంలో నిలిచింది. జవహర్లాల్ నెహ్రూ, ముంబయి పోర్టులను అధిగమించి మూడో స్ధానాన్ని దక్కించుకుంది.
పోటీని తట్టుకుని నిలిచి
విశాఖ పోర్టుకు అత్యంత సమీపంలోనే ఉన్న గంగవరం పోర్టు నుంచి గట్టి పోటీ ఉంది. అలానే కృష్ణపట్నం నుంచి కూడా పోటీని తట్టుకుంటూ ఈ రికార్డును సాధించడం విశేషం. కొవిడ్ ప్రభావం వల్ల గడచిన అర్ధిక సంవత్సరంలో చివరి 3 నెలలు తీవ్రమైన ఆర్థిక మందగమనం ఏర్పడినా.. ఇంత వృద్ధి రేటు సాధించడం సమష్టి కృషి వల్లనే సాధ్యపడిందని పోర్టు ఛైర్మన్ రామ్మోహనరావు చెబుతున్నారు.