విజయవంతమైన వస్త్ర తయారీ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న విశాఖ బ్రాండిక్స్ పరిశ్రమ కరోనాపై పోరులోనూ ముందడుగు వేసింది. వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి రక్షణ కవచాల తయారీకి శ్రీకారం చుట్టింది. విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ పరిశ్రమ... నిత్యం వేల మంది మహిళా కార్మికులతో నిండి ఉండేది. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం నిర్మానుష్యంగా మారింది. శ్రీలంకకు చెందిన సిబ్బంది 120 మంది వరకు ఇక్కడే ఉండిపోయారు. పరిశ్రమ ప్రాంగణంలోని గృహ సముదాయాల్లోనే వారు నివాసం ఉంటున్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సూట్ల కొరత వేధిస్తున్న వేళ..ఈ పరిశ్రమపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిశ్రమ, ఉద్యోగులు సైతం ఉత్సాహంగా ముందుకు రాగా అవసరమైన ముడి సరుకును ప్రభుత్వం అందించింది. బయటనుంచి కార్మికులు వచ్చి వెళ్లే పరిస్థితి లేనందున ఉన్నతోద్యోగులే కార్మికులుగా మారి తయారీ ప్రారంభించారు.
కరోనా పోరుకు బ్రాండిక్స్ సహకారం
కార్మికులు లేరు... ముడిసరుకూ లేదు. అయినా కరోనాపై పోరాటంలో ఆ సంస్థ ముందడుగు వేసింది. ప్రభుత్వం అడిగిందే తడవుగా వైద్య సిబ్బందికి రక్షణ దుస్తుల తయారీకి శ్రీకారం చుట్టింది. ఉన్నతస్థాయి ఉద్యోగులే కూలీలుగా ఇప్పటికే కొంతమేర ఉత్పత్తి సిద్ధం చేసింది. ఇతర రాష్ట్రాల వారికీ సాయమందించేందుకు సిద్ధమని భరోసా ఇస్తోంది.
vizag Brandix making protective clothing for medical staff
ప్రస్తుతం రోజుకు 2 వేల వరకు సూట్లు ఇక్కడ తయారవుతున్నాయి. ప్రత్యేక అనుమతులు, ముందస్తు జాగ్రత్తలతో కార్మికులను రప్పించి ఉత్పత్తి పెంచేందుకు సైతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తగిన సహకారం అందిస్తే రోజుకు 20వేల వరకు పీపీఈలు తయారు చేయగలమని బ్రాండిక్స్ ప్రతినిధులు చెబుతున్నారు. రాష్ట్ర అవసరాలు తీర్చడం సహా దేశంలో మిగిలిన ప్రాంతాలకు సరఫరా చేసేందుకూ శ్రమిస్తామని భరోసా ఇస్తున్నారు.
ఇదీ చదవండి:వ్యాక్సిన్ తయారీలో అగ్రరాజ్యాలతో భారత సంస్థల పోటీ