సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి స్వామి దేవస్థానంలో దేవాదాయశాఖ అధికారులు చేపట్టిన ఆభరణాల తనిఖీ కొనసాగుతోంది. దేవాదాయశాఖ అధికారి ప్రసాద్, అప్రైజర్ శ్రీను ఆధ్వర్యంలో ఆలయంలోని ఆభరణాలను పరిశీలించారు. స్వామికి అలంకరించే బంగారు, వెండి వస్తువులతో పాటు.. ప్రాంగణంలోని అమ్మవార్లు, ఇతర దేవతామూర్తులకు అలంకరించే ఆభరణాలను తనిఖీ చేశారు.
ఈ తనిఖీలను స్వయంగా పరిశీలించేందుకు అవకాశం కల్పించాలని ఈవో సూర్యకళను కోరినా తమను అనుమతించలేదని విశ్వహిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి పూడిపెద్ది శర్మ పేర్కొన్నారు. ఎట్టకేలకు అనుమతించినా అప్పటికే తనిఖీలు పూర్తయ్యాయని ఆగ్రహించారు. దేవస్థానం అధికారులెవరూ లేకుండానే దేవాదాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టడం సరికాదన్నారు. తనిఖీలను గోప్యంగా జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సమగ్రంగా తనిఖీలు నిర్వహించి ఆభరణాల చిట్టాను భక్త సమాజానికి వెల్లడించాలని డిమాండ్ చేశారు.