'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' నినాదం రోజురోజుకీ ఉద్ధృతమవుతోంది. ఈ నినాదం స్ఫూర్తితో పోరాటాన్ని తీవ్రతరం చేస్తున్నారు. కలసికట్టుగా ఆందోళనలు చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు.. పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని తేల్చిచెబుతున్నారు. బుధవారం విశాఖలో జరిగిన బహిరంగ సభ వేదికగా.. వైకాపా ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ముఖ్యమంత్రితో పాటు అధికార పార్టీ ఎంపీలు వెంటనే ప్రధానమంత్రిని కలిసి..ప్రైవేటీకరణ ఆపాల్సిందిగా డిమాండ్ చేయాలని సూచిస్తున్నారు.
పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని.. ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు అంటున్నారు. రాష్ట్రంలో అధికార పక్షంగా ఉంటూ, ఎంపీల సంఖ్యాబలం కూడా మెండుగా ఉన్న వైకాపా.. కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. విశాఖ తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ.. ఉక్కు ఉద్యమంలో ముందున్నామని అంటున్నారు.