ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ జిల్లాలో వైకాపా విజయ యాత్ర' - ycp

రాష్ట్రమంతటా ఫ్యాన్ గాలి వీచింది. ఈ సారి ఎన్నికల్లో వైకాపాకు ఎదురే లేకుండా పోయింది. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖలో సైతం వైకాపా సత్తా చాటింది.

'ఉక్కు నగరంలో వైకాపా విజయ దుందుభి'

By

Published : May 24, 2019, 7:59 AM IST

15 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఉన్న విశాఖ జిల్లాలో వైకాపా జోరు చూపించింది. కిందటిసారి ఎన్నికల్లో తెదేపా కూటమి దూసుకెళ్లగా..వైకాపాకు కేవలం 3 సీట్లతో సర్దిపెట్టుకోవాల్సివచ్చింది. కానీ ఈ సారి మాత్రం వైకాపా ఏకంగా 11 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది.
నర్సీపట్నం...
జిల్లాలో అత్యధికంగా తొమ్మిదో సారి ఎన్నికల బరిలో ఉన్న మంత్రి అయ్యన్నపాత్రుడు.. వైకాపా అభ్యర్ధి పెట్ల ఉమా శంకర్ గణేశ్ మధ్య జరిగిన పోటీలో విజయం వైకాపానే వరించింది.
విశాఖ ఉత్తరం...
ప్రతిసారి కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా భవితవ్యం ఈసారి ఏ తీరున ఉంటుందన్న అంశంపై అందరిలోనూ అసక్తి నెలకొనగా... మరో సారి ప్రజలు గంటా శ్రీనివాసరావుకే పట్టం కట్టారు. వైకాపా అభ్యర్థి కమ్మిల కన్నపరాజుపై విజయం సాధించారు.
విశాఖ పడమర...
విశాఖ పడమర నియోజకవర్గంలో తెదేపా విజయకేతనం ఎగురవేసింది. వైకాపా అభ్యర్థి విజయ ప్రసాద్​ మళ్లపై తెదేపా అభ్యర్థి పీజీవీఆర్​ నాయుడు గెలుపొందారు.
విశాఖ దక్షిణం...
విశాఖ దక్షిణ నియోజకవర్గంలోనూ తెదేపా విజయం సాధించింది. వైకాపా అభ్యర్థి ద్రోణం రాజు శ్రీనివాస్​పై తెదేపా అభ్యర్థి వాసుపల్లి గణేశ్ కుమార్ పై చేయి సాధించారు.
విశాఖ తూర్పు...
విశాఖ తూర్పులోనూ సైకిల్ జోరు చూపించింది. వైకాపా మహిళా అభ్యర్థి విజయనిర్మలపై తెదేపా అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు విజయం సాధించారు.
గాజువాక...
రాష్ట్ర వ్యాప్తంగా అందరికి ఆసక్తిగా ఉన్న నియోజకవర్గం గాజువాక. తెదేపా, వైకాపా రెండు కూడా పోటాపోటీగానే ఉండటం.. ఇక్కడ పవన్ కల్యాణ్ పోటీ చేయటంతో అందరిలో ఉత్కంఠ కలిగించగా... వైకాపా పై చేయి సాధించింది. తెదేపా అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు, జనసేనాని పై వైకాపా అభ్యర్థి తిప్పలనాగిరెడ్డి విజయం సాధించారు.
భీమిలి...
భీమిలి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్ధి సబ్బం హరి, వైకాపా నుంచి అవంతి శ్రీనివాస్ పోటీపడగా విజయం అవంతి వైపే మొగ్గు చూపింది.
అరకు...
అరకులో తెదేపా అభ్యర్థి మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ , వైకాపా అభ్యర్థి చెట్టి ఫల్గుణల మధ్య జరిగిన పోరులో కిడారి ఓటమి పాలయ్యారు. మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరాలు కుమారుడైన శ్రవణ్ కుమార్​పై ప్రజల సానుభూతి పనిచేయలేదు.
చోడవరం...
చోడవరం నియోజకవర్గంలో వైకాపా, తెదేపా మధ్య పోరు రసవత్తరంగా సాగింది.ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యం రౌండు రౌండుకు మారినా...చివరకు తెదేపా అభ్యర్థి కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజుపై వైకాపా అభ్యర్థి ధర్మశ్రీ విజయం సాధించారు.
మాడుగుల...
మాడుగులలో తెదేపా అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడుపై వైకాపా అభ్యర్థి బి.మూత్యాల నాయుడు విజయం సాధించారు.
పాడేరు...
ఎస్టీ రిజర్వ్​డ్ నియోజకవర్గమైన పాడేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఓటమి పాలయ్యారు. తెదేపా నుంచి బరిలోకి దిగిన ఆమె వైకాపాకు చెందిన తన సమీప ప్రత్యర్థి భాగ్యలక్ష్మి చేతిలో భారీ తేడాతో ఓటమి పాలయ్యారు.
అనకాపల్లి...
అనకాపల్లి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి పి.గోవింద సత్యనారాయణపై వైకాపాకు చెందిన ఏవీఎస్ఎస్ అమర్​నాథ్ స్వల్ప తేడాతో విజయం సాధించారు.
పెందుర్తి...
పెందుర్తి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి అదీప్ రాజు విజయం సాధించారు.తెదేపాకు చెందిన తన సమీప ప్రత్యర్థి బండారు సత్యనారాయణ పై ఘన విజయం సాధించారు.
యలమంచలి...
యలమంచలి నియోజకవర్గంలో వైకాపా, తెదేపా అభ్యర్థుల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లు సాగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల పోరులో విజయం చివరకు వైకాపానే వరించింది. తెదేపా అభ్యర్థి పంచకర్ల రమేశ్​బాబుపై వైకాపా అభ్యర్థి కన్నబాబు రాజు స్వల్పతేడాతో విజయం సాధించారు.
పాయకరావుపేట...
ఎస్సీకి రిజర్వ్​ అయిన పాయకరావుపేటలో తెదేపా అభ్యర్థి డా.బుడుమూరి బంగారయ్యపై వైకాపా అభ్యర్థి గొల్లబాబూరావు విజయం సాధించారు.
మూడుకు...మూడు వైకాపావే...
విశాఖ పార్లమెంట్ స్థానంలో పోరు హోరా హోరిగా సాగింది. తెదేపా, వైకాపా, జనసేనల మధ్య పోరు రసవత్తరంగా జరిగింది. విజయం మూడు పార్టీల మధ్య దోబుచులాడిన చివరకు వైకాపానే వరించింది. తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్​పై వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారయణ ఆధిక్యంలో ఉన్నారు. జనసేన నేత లక్ష్మీనారాయణ మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అనకాపల్లిలో తెదేపా-వైకాపా మధ్య ప్రధాన పోటీ నెలకొన్న విజయం మాత్రం తెదేపానే వరించింది. తెదేపా అభ్యర్థి ఆడారి ఆనంద్‌పై వైకాపా అభ్యర్థి డాక్టర్ వెంకట సత్యవతి విజయం సాధించారు. ఎస్టీ రిజర్వ్​డ్ నియోజకవర్గమైన అరకులో మాజీ కేంద్రమంత్రి, తెదేపా అభ్యర్థి కిశోర్ చంద్రదేవ్​పై వైకాపా అభ్యర్థి గొడ్డేటి మాధవి విజయం సాధించారు.

ABOUT THE AUTHOR

...view details