జాతీయ ఎన్నికల వేదిక ఆధ్వర్యంలో విశాఖలో 'పట్టణ పేదల ఎన్నికల మేనిఫెస్టో' కార్యక్రమం చేపట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో.. కాలనీల మేనిఫెస్టోను తయారు చేసేందుకు విశాఖ పౌర గ్రంథాలయంలో సమావేశమయ్యారు. 'మన ఓటు-మన భవిత' నినాదంతో నగరంలోని వివిధ కాలనీ వాసులతో చర్చలు జరిపారు. ప్రధానంగా నగరంలోని పేద, అల్పాదాయ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఈ మేనిఫెస్టో రూపొందించాలని వేదిక యత్నిస్తోందని విశ్రాంత ఐ.ఎ.ఎస్.అధికారి ఇ.ఎ.ఎస్. శర్మ అన్నారు.
ప్రజలేమంటున్నారంటే..
తాము ఓటు వేసే ప్రజాప్రతినిధి ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ కాలనీలను సందర్శించి.. సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు.. తమ ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తే నోటా ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు.