సాగు తీరు మారుతోంది. రసాయన ఎరువులను పక్కన పెట్టి ప్రకృతి వ్యవసాయం వైపు మారుతున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. పెట్టుబడులు తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన, ఆరోగ్యవంతమైన పంటల సాగు పట్ల ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖ జిల్లాలో ప్రకృతి వ్యవసాయానికి పెరుగుతున్న ఆదరణే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ రైతులు సేంద్రియ పద్ధతికి తోడు మిశ్రమ పంటల విధానాన్ని ఆచరిస్తున్నారు. కొందరు ఏడాది పొడవునా పంట దిగుబడి తీస్తూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయానికి అధికారులు అందించే ప్రోత్సాహంతో కొత్త రైతులు ప్రకృతి వ్యవసాయం బాట పడుతున్నారు.
ఏటేటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం.. రైతుల సంఖ్య..
విశాఖ జిల్లాలో నాలుగేళ్ళ క్రితం వెయ్యి ఎకరాల్లో సేంద్రియ సాగు విధానం అమలయ్యేది. 2016 సంవత్సరం తరువాత సేంద్రియ పద్ధతులు పాటించే రైతుల సంఖ్య పెరిగింది. నాటి ప్రభుత్వం ప్రకృతి సేద్యాన్ని ఎక్కువగా ప్రోత్సహించడం.. సుభాష్ పాలేకర్‌తో అవగాహన తరగతులు పెట్టండం వల్ల ఎక్కువమంది రైతులు ఈ సేద్యం వైపు ఆకర్షితులయ్యారు. దీంతో వెయ్యి ఎకరాల సేంద్రియ సాగు విస్తీర్ణం గడచిన మూడేళ్ళలో 27,594 ఎకరాలకు పెరిగింది. 4,800 మందిగా ఉండే ప్రకృతి సేద్యం రైతుల సంఖ్య 35,000 పెరిగింది. ఏటా వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రకృతి సాగు విస్తీరణం పెరిగేలా వ్యవసాయశాఖ కూడా లక్ష్యాల్ని నిర్దేశించుకొని ముందుకు వెళుతోంది.
తగ్గుతున్న ఎరువుల ఖర్చులు.. రవాణా ఖర్చులు..
రసాయన ఎరువుల వినియోగంతో భూసారం కోల్పోతుండడం, పెట్టుబడులు విపరీతంగా పెరగడంతో రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు క్రమంగా మళ్లుతున్నారు. పైగా మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులకు వినియోగదారులు పెరగడంతో ఒకప్పుడు చిన్న కమతాలకే పరిమితమైన ప్రకృతి వ్యవసాయం నేడు పెద్ద పెద్ద కమతాల్లోనూ ఆచరణలో పెడుతున్నారు. పాడి పశువులను పెంచుతూ వాటి పేడ, మూత్రాన్ని ఉపయోగించే ఘన, ద్రవ, జీవామృతాలను తయారు చేసి పంటలకు ఎరువుగా ఉపయోగిస్తున్నారు. ఓ వైపు పాల దిగుబడితో ఆదాయం పొందుతూ.. మరోవైపు ఎరువుల తయారీతో పెట్టుబడి భారాన్ని తగ్గించుకుంటున్నారు. సేంద్రియ పద్దతిలో సాగు చేస్తున్న కూరగాయలను మార్కెట్‌కు తరలించకుండా పొలం దగ్గరే మొత్తం అమ్మకాలు చేస్తున్నట్లు చోడవరం మండల౦ రైతులు చెబుతున్నారు. రవాణా ఖర్చులు కూడా తగ్గిపోయాయని సంతోషిస్తున్నారు.
ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్న.. ఫైవ్ లేయర్ పద్ధతిలో సాగు..
ప్రకృతి వ్యవసాయానికి తోడు బహుళ మిశ్రమ పంటల విధానాన్ని ఎక్కువమంది రైతులు ఆచరిస్తున్నారు. ఫైవ్ లేయర్‌గా పిలవబడే ఐదంతస్థుల సాగు పద్ధతిలో ఒక్కో వరసలో ఒక్కో రకమైన మొక్కలను నాటిస్తున్నారు. దీనివల్ల ఎకరా విస్తీర్ణంలో 48 మొక్కలు నాటే చోట 150 మొక్కలు నాటడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఒక్కో సీజన్లో ఒక్కో రకం పంట చేతికందుతుందని రైతులంటున్నారు. కొబ్బరి, మామిడి, అరటి, జామ, సపోటా, వక్క, చెర్రీ, నారింజ, నిమ్మ, బొప్పాయి ఇలా 15 నుంచి 20 రకాల మొక్కలను ఫైవ్ లేయర్ పద్దతిలో పండించుకోవచ్చని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే ఆ మొక్కల మధ్యన ఆకుకూరలు, కూరగాయలు, దుంప జాతులు, మిరపకాయలను మిశ్రమ పంటలుగా పండిస్తూ సమీకృత వ్యవసాయం చేయడం ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే అవకాశం ఉందని సంబంధిత అధికారులంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో మిశ్రమ పంటలు సాగుచేసే రైతులు పెరుగుతున్నట్లు చెబుతున్నారు.
ఏలూరు వింత వ్యాధి ఘటన వెలుగు చూసిన తరువాత.. సేంద్రియ సాగు పట్ల మరింత మంది రైతులు ముందుకువచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రకృతి సేద్యాన్ని లక్ష ఎకరాలకు పెంచాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులంటున్నారు.
ఉదీ చదవండి: సాగు చట్టాలపై ఈ-బుక్లెట్లు చదవాలని మోదీ విజ్ఞప్తి