'మార్పు నాతోనే మొదలవ్వాలి.. నగరాన్ని పర్యావరణహితంగా మార్చాలి' అని అంటున్నారు విశాఖ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన జియ్యాని శ్రీధర్ అన్నారు. గతంలో కార్పొరేటర్‌గా చేసిన అనుభవంతో ఇప్పుడు నగరాభివృద్ధిలో భాగస్వామ్యమవుతానని అంటున్నారు.
ప్రమాణస్వీకారం చేయనికి సైకిల్‌పై వెళ్తున్న జియ్యాని శ్రీధర్ 'విశాఖను గ్రీన్‌సిటీగా మార్చాలని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ స్ఫూర్తితో గురువారం ఎన్‌ఏడీ కొత్తరోడ్ నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు సైకిల్‌పై వచ్చి ప్రమాణస్వీకారంలో పాల్గొన్నాను. ఓ కార్పొరేటర్‌గా కార్లు, బైకుపై కాకుండా పెట్రోలు, డీజిల్ ఆదా చేసేలా సైకిల్‌లో తిరిగితే నగరానికి మేలు జరుగుతుందనే ఆలోచనతో ఇలా చేశాను. ఇదే ఉద్దేశంతోనే భవిష్యత్తు కార్యచరణనూ రూపొందించుకుని ముందుకెళ్తా. తీర నగర సమగ్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం తీసుకురావాలనేది నా ఆకాంక్ష.'- విశాఖ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్
రోడ్ల ఇబ్బందులపై దృష్టి..
నగరంలో చాలా ఇబ్బందులున్నాయి. ప్రధానంగా రోడ్లు చాలాచోట్ల తవ్వేశారు. ఆయా మార్గాల్లో సక్రమరీతిలో ప్రణాళికబద్ధంగా పనుల్ని పూర్తిచేయాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న బీఆర్‌టీఎస్ రోడ్లు వ్యవహారాన్ని కూడా కౌన్సిల్‌లో చర్చకు పెట్టి పరిష్కరిస్తాం.
‘నా మైండ్‌లో ఉన్నావ్’..!
సీఎం జగన్ ఎప్పుడు విశాఖ వచ్చినా మా ఇంటి కాఫీ తప్పనిసరిగా తీసుకుంటారు. ఇలా నాకు ఆయనతో సాన్నిహిత్యం బాగా పెరిగింది. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై కత్తిదాడి జరిగినప్పుడు నేను పక్కనే ఉన్నాను. నిందితుడు శ్రీనివాస్‌ను అడ్డుకుని పక్కకు తీయడం లాంటివి చేశాను. హుద్‌హుద్ తుపానులో నేనుండే ప్రాంతంలో పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలు చేశాం. ఇవన్నీ జగన్ ప్రత్యక్షంగా చూశారు. 5నెలల క్రితం దిల్లీలో సీఎంను కలిసినప్పుడు తప్పకుండా మంచి పొజిషన్ ఇస్తామని మాటిచ్చారు. మొన్న శివరాత్రిన కూడా జగన్‌ను కలిశాను. ఓ సారి ‘నా మైండ్‌లో ఉన్నావ్’ అనే మాట అన్నారు. ఇప్పుడు నన్ను జీవీఎంసీకి డిప్యూటీ మేయర్‌ను చేశారు. ఆయన మాట నిలబెట్టుకున్నారు. ప్రజల కోసం నేను పాటు పడతాను. ఆదర్శ కార్పొరేటర్‌గా ఉంటాను. గతంలో ఇండిపెండెంట్‌గా కార్పొరేటర్‌గా గెలిచి దివంగత ముఖ్యమంత్రితో కలిసి పనిచేశాను. ఇప్పుడు జగన్‌తో ఉంటాను.
ఇదీ చదవండి: రాజకీయాలకు అతీతంగా జీవీఎంసీ పాలక మండలిని నడిపిస్తా: మేయర్